Site icon NTV Telugu

India T20 Series Win: ఓడినా.. చరిత్ర సృష్టించిన హర్మన్ సేన!

India T20 Series Win (1)

India T20 Series Win (1)

India T20 Series Win: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి ఓటమి పాలైంది. ఈ సిరీస్‌ను భారత్ 3-2తో గెలిచింది. హర్మన్‌ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ విజయంతో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి రెండుకు పైగా మ్యాచ్‌లు ఉన్న టీ20 సిరీస్‌ను గెలిచి చరిత్రను సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో షెఫాలీ వర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడినా, భారత మహిళల జట్టు చివరి బంతికి మ్యాచ్‌ను కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి 15 బంతుల్లోనే మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మంధానా, జెమీమా రోడ్రిగ్స్ ఔట్ కావడంతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ షెఫాలీ వర్మ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది.

Read Also:AP Deputy CM Pawan: తెలుగు భాష, యాసలపై కోట శ్రీనివాసరావుకు మంచి పట్టు ఉంది..

షెఫాలీ 41 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 75 పరుగులు చేసింది. ఆమె మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ 25 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు సోఫియా డంక్లీ (46), డేనియల్ వ్యాట్-హాజ్ (56) మంచి శుభారంభం అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం అందించి మ్యాచ్‌ పై ఆధిపత్యం సాధించారు. అయితే, ఓపెనింగ్ జోడీ ఔట్ అయిన తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను చివరి ఓవర్ చివరి బాల్ వరకు తీసుక వెళ్లారు. చివరి ఓవర్‌ లో ఒత్తిడి పెంచినా, ఇంగ్లండ్ జట్టు చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను గెలుచుకుంది.

Read Also:RIP Kota Srinivasa Rao: యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారు: కిషన్ రెడ్డి

ఇది భారత్‌కు ఓటమి అయినప్పటికీ, సిరీస్ విషయానికొస్తే భారత మహిళల జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి 3-2తో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారిగా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన టీ20 సిరీస్‌ను గెలిచిన చారిత్రక ఘనతను సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత సేన ఈ విజయంతో చరిత్ర సృష్టించింది.

Exit mobile version