NTV Telugu Site icon

Deepika Padukone Birthday Special: ‘పఠాన్’కు రక్ష…పదుకొణే పాప పరువాలు!

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone Birthday Special: జనవరి 25న జనం ఏం చేస్తారో చూడాలి? ఇంతకూ ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? అంటే ఆ రోజున షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం విడుదల కానుంది. అందులో ప్రత్యేకత ఏముందబ్బా అంటారా? అవును, షారుఖ్ సినిమా వస్తోందంటే పరుగులు తీస్తూ థియేటర్లకు వెళ్ళే జనాల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిన మాట వాస్తవం! కానీ, అదే సినిమాలో నాయిక దీపికా పదుకొణే “హమే తో లూట్ లియా మిల్కే ఇష్క్ వాలోం నే…” అంటూ సాగే పాటలో చేసిన జఘన విన్యాసాలను జనం మరచిపోలేకుండా ఉన్నారు. ఆ సినిమాపై ఓ వైపు ‘బాయ్ కాట్’ అంటూ ట్రోల్ సాగుతున్నా, దీపిక నడుము ఊపులు చూసినవాళ్ళు నఖశిఖపర్యంతం మెలితిరిగిపోతున్నారు. అందువల్ల ‘పఠాన్’కు దీపికా పదుకొణే అందాలవిందులే పెద్ద ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆ పాటలోని పదుకొణే పాప పరువాలే ‘పఠాన్’ను కాపాడాల్సిన సమయం. కాబట్టి జనవరి 25న ఏం జరుగుతుందో చూడాలి అన్న ఆసక్తి ముంబై సినిమా జనంలో నెలకొంది. అంతలా అందంతో బంధాలు వేస్తోన్న దీపికా పదుకొణే ఉత్తరాదిన తనదైన బాణీ పలికిస్తూ సాగుతోంది.

ప్రఖ్యాత బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణే పెద్ద కూతురుగా 1986 జనవరి 5న జన్మించింది దీపిక. కర్ణాటకకు చెందిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దీపిక మాతృభాష కొంకణి. బాల్యం నుంచీ దీపికకు ఆటపాటల్లో అలరించే తత్వం అలవడింది. బహుశా తండ్రి నుండి వచ్చిన లక్షణం కావచ్చు. స్కూల్ లో చదివే రోజుల నుంచీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ లో పాల్గొని మురిపించింది. ఆ తరువాత మెల్లగా ఆమెకు నటనపై అభిలాష కలిగింది. ముంబై వెళ్ళి మోడల్ కావాలన్న తన కలను నెరవేర్చుకుంది. కొన్ని కమర్షియల్స్ లో నటిస్తున్న సమయంలోనే ప్రఖ్యాత కన్నడ స్టార్ ఉపేంద్ర దృష్టిలో పడింది దీపిక. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మన్మథుడు’ చిత్రం రీమేక్ గా కన్నడలో ఉపేంద్ర నటించిన ‘ఐశ్వర్య’ చిత్రం రూపొందింది. అందులో ప్రధాన నాయికగా నటించింది దీపిక. ఆ తరువాతే హిందీలో ‘ఓం శాంతి ఓం’ లో బాలీవుడ్ కు పరిచయమయింది దీపిక.

భారతదేశంలో ఎంతోమంది అందాలభామలకు బాలీవుడ్ లో రాణించాలన్నదే ప్రధాన లక్ష్యం. దీపిక పదుకొణే కూడా అలాగే ఆశించింది. ఆమెను కొన్ని కమర్షియల్స్ లో చూడడం వల్ల నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరా ఖాన్ తాను రూపొందించిన ‘ఓం శాంతి ఓం’లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది. షారుఖ్ ఖాన్ సైతం దీపికను ఎంతగానో ప్రోత్సహించాడు. హిందీలో దీపిక రెండో చిత్రం ‘బచ్ నా యే హసినో’. ఆ చిత్రం సమయంలోనే హీరో రణబీర్ తో ప్రేమాయణం సాగించింది దీపిక. “చాందినీ చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్, కాక్ టెయిల్, రేస్-2” చిత్రాలతో దీపిక పేరు బాలీవుడ్ లో మారుమోగి పోయింది. తన తొలి హిందీ హీరో షారుఖ్ ఖాన్ తో కలసి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లో భలేగా నటించింది. ఈ సినిమా బంపర్ హిట్ గా నిలచింది. షారుఖ్ చివరి బ్లాక్ బస్టర్ గా ఇప్పటికీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ పేరే వినిపిస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ తో కలసి ‘యే జవానీ హై దివానీ’లో మరో మారు నటించింది. అప్పటికే వారి మధ్య మనస్పర్థలు పొడసూపాయి. తరువాత అమ్మాయిగారి అందం చూసి అందరిలాగే రణ్ వీర్ సింగ్ ఆకర్షితుడయ్యాడు. వారిద్దరూ నటించిన ‘గలియోంకీ రాస్ లీల రామ్ లీల’ జనాన్ని మురిపించింది. ఆపై ఇద్దరిలోనూ ప్రేమ అంకురించింది. అది పరిణయంగా మారింది.

పెళ్ళయిన తరువాత కూడా దీపిక, రణ్ వీర్ సింగ్ ఎవరికివారు బిజీగా ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కలసి కొన్ని కమర్షియల్స్ లో అలరించడం మానలేదు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన ’83’ చిత్రంలో దీపిక భర్తతో పాటు నటించింది. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించబోయే సైంటిఫిక్ ఫిక్షన్ లో నాయికగా నటించనుంది దీపిక. గతంలో జయంత్ దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రంలో దీపిక ఓ పాటలో నర్తించింది. ఆ తెలుగు చిత్రం ఇంకా వెలుగు చూడలేదు. మూడున్నర పదులు దాటినా ఇంకా నాజూకు షోకులతో మురిపిస్తోన్న దీపికా పదుకొణే మునుముందు ఏ తీరున అలరిస్తుందో చూడాలి.