Davos WEF Summit 2026: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు ప్రపంచ వ్యాప్తంగా 65 మంది దేశాధినేతలు, పలు కంపెనీల అధిపతులు, వ్యాపారవేత్తలు, సీఈవోలు తరలివెళ్తున్నారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. 130 దేశాలకు చెందిన మూడు వేల మంది నేతలు పాల్గొంటారని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ సమ్మిట్‌కు హాజరవుతారు. ప్రఖ్యాత కంపెనీలకు చెందిన 850 మంది అగ్రశ్రేణి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, చైర్‌పర్సన్‌లు, వ్యవస్థాపకులు చర్చలలో పాల్గొంటారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. పోటీ ప్రపంచంలో సహకారం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, సమ్మిళిత అభివృద్ధిపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
దావోస్ సదస్సులో పాల్గొనేందుకు అర్ధరాత్రి బయల్దేరి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో ఆయన జ్యూరిచ్ చేరుకోనున్నారు.. ఆయన వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదికపై పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా… ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. తొలుత జ్యూరిచ్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత రోడ్డు మార్గాన దావోస్‌కు వెళ్తారు. దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, వివిధ శాఖల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై చర్చిస్తారు. టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తోనూ సమావేశమై చర్చిస్తారు. మొత్తంగా దావోస్‌లో నాలుగు రోజల పాటు పర్యటించనున్న చంద్రబాబు.. 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 16 వన్ టు వన్ మీటింగ్‌లు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్‌కు హాజరవుతారు.
ఇక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం… ఇవాళ దావోస్‌కు బయల్దేరి వెళ్లనుంది. తెలంగాణకు పలు రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించనుంది ఈ బృందం. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను దావోస్‌లో అధికారికంగా ప్రారంభిస్తారు. క్యూర్, ప్యూర్, రేర్‌కు సంబంధించిన విధానాలను వివరించి పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణంపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రైపోర్ట్, బుల్లెట్ ట్రైన్ అంశాలను దావోస్ సదస్సులో ప్రస్తావిస్తారు. రేపు తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ, ఏఐ హబ్‌లను ఆవిష్కరించనున్నారు.
