Site icon NTV Telugu

Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

Crocodile Captured In Konas

Crocodile Captured In Konas

Crocodile Captured in Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఆరు నెలలుగా రైతులను భయాందోళనకు గురిచేసిన మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. పి. గన్నవరం సమీపంలోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం, వరదల సమయంలో ఆరు నెలల క్రితం ఈ మొసలి ఈ ప్రాంతంలోకి చేరింది. అప్పటి నుంచి నీటి మడుగులు, చెరువుల వద్ద సంచరిస్తూ రైతులు, జాలర్లలో భయాన్ని కలిగించింది. పొలం పనులు చేయడానికి వెళ్లే రైతులు ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తుందనే ఆందోళనలోనే జీవించారు.

Read Also: Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

మొసలిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో అధికారులు కొంతకాలం తరువాత ప్రయత్నాలను నిలిపివేశారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు ఆ మొసలి చిక్కింది. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేశారు. మొసలి పట్టుబడడంతో గత ఆరు నెలలుగా భయంతో జీవించిన రైతులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

Exit mobile version