Site icon NTV Telugu

Jairam Ramesh: ఇండియా కూటమి లోక్‌సభకే పరిమితం

Ramesh

Ramesh

ఇండియా కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశారు. విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకేనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా రామ్‌పుర్‌హట్‌లో జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడారు. 27 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి పూర్తి మనుగడలో ఉందని.. కలిసికట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర రాజకీయ కార్యక్రమం కానప్పటికీ పార్టీకి కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేవలం మహారాష్ట్రలోనే కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. బీజేపీకి ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ఎన్నడూ సహకరించని ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని పరిరక్షించేందుకు బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని జైరాం రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగమైన జేడీయూ ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. బీహార్‌లో బీజేపీతో కలిసి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక కూటమిలో భాగస్వామ్యం అయిన తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించాయి. ఇక సమాజ్‌వాది పార్టీ అయితే ఎలాంటి చర్చలు లేకుండానే 16 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. ఇలా ఎవరికి వారే కూటమితో సంబంధం లేకుండా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల సమయానికి ఇండియా కూటమి కొనసాగుతుందో.. లేదో వేచి చూడాలి.

Exit mobile version