CM Revanth Reddy: భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి వరద అక్కడికి చేరుకున్నారు. వరద బాధితులను కలిసి పరామర్శించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జిని పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. తత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయ్యాయని, పంటలతో పాటు ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని సీఎంకు రైతులు, గ్రామస్థులు వివరించారు. అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. విభాగాల వారీగా వరద నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
READ MORE: Tollywood : తెలుగులో సినిమాలు ఎందుకు చేయట్లేదో చెప్పేసిన యంగ్ బ్యూటీ
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. “వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడు. మీకు అండగా ఉండి ఎమ్మెల్యే అడ్డుకున్నారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి.” అని వ్యాఖ్యానించారు.
