NTV Telugu Site icon

Cm Jagan Mohan Reddy: కడప జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన ..షెడ్యూల్ ఇదే

Jagan 1

Jagan 1

బుధవారం ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్ వైయ‌స్‌ఆర్‌ కడప జిల్లాలో ప‌ర్యటించనున్నారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుద‌ల చేశారు. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో వివాహ రిసెప్షన్‌ వేడుకకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ హాజరవుతారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. 11.10 – 11.30 జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం ఉంటుంది. ఈకార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ కూడా పాల్గొంటారు.

Read Also: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు

అలాగే శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 11.45 – 12.45 మధ్య స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.40 కి పులివెందుల చేరుకుంటారు. 2.00 – 2.15 మధ్య పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదిలా ఉండగా.. 2019లో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో రెండేళ్లు పనులు జరగలేదు. కోవిడ్ అనంతరం ఇప్పుడు రూ.1,76,000 కోట్ల (22 బిలియన్‌ డాలర్లు) మార్కెట్‌ విలువ కలిగి, ఏటా 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో పనులు చకచకా జరగనున్నాయి.

ఈ సంస్థకు ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరిస్తుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తెస్తుంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ ప్లాంట్‌ను జాతీయ రహదారి 67కు అనుసంధానిస్తూ 7.5 కిలోమీటర్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తోంది. ప్రొద్దుటూరు – ఎర్రగుంట్ల రైల్వే లైన్‌కు అనుసంధానిస్తూ 10 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనుంది. మైలవరం రిజర్వాయర్‌ నుంచి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక పైప్‌లైన్‌ నిర్మిస్తోంది. ఈ పనుల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: KA Paul: వెంకటరెడ్డి ఎవరో నాకు తెలీదు.. 90 శాతం ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉన్నారు