Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. పలువురు ఏపీ మంత్రులు.. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.. సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం.. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు.. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు..
ఇక, కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.. బస్సు దగ్ధమై పలువురు ప్రయాణికులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న ఆయన.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రమాద ఘటనపై ప్రభుత్వం అన్ని రకాల సహయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.
మరోవైపు, కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత.. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హోం మంత్రి.. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంటున్న మంత్రి.. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం అన్నారు.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి.. మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు హోం మంత్రి వంగలపూడి అనిత.
ఈ ఘటనపై స్పందించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన ప్రమాద ఘటన తీవ్రగా కలచివేసిందన్నారు.. ఘటనపై వెంటనే స్పందించి ఘటనాస్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మనసును కలచివేసిందని అవేదన వ్యక్తం చేశారు.. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, పలువురి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కర్నూలు శివారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవదహనమవడం అత్యంత విషాదకరమని పేర్కొన్న ఆయన.. ఈ ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేసింది.. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని సూచించారు మాజీ సీఎం వైఎస్ జగన్.
