Selfi Fight: పెళ్లైన మహిళలతో సెల్ఫీలు దిగేందుక ప్రయత్నించిన దుండగులను పోలీసులు స్టేషన్లో పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కొందరు వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పెళ్లయిన మహిళలను తమతో సెల్ఫీ దిగాలంటూ బలవంతం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గౌర్ సిటీ ఫస్ట్ అవెన్యూ సొసైటీలో జరిగిన కొత్త సంవత్సర వేడుకలో ఇద్దరు మహిళలతో సెల్ఫీలు దిగేందుకు కొందరు పురుషులు ప్రయత్నించారు… దీంతో వారి భర్తలకు, నిందితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అధికారులు తెలిపారు. నిందితులు వారి భర్తలను లాగి కొట్టారు.
Read Also: Violation of Law : చట్టాన్ని అతిక్రమించినందుకు వారంలో 15వేల మంది అరెస్ట్
ఈ విషయంలో మరికొందరు నివాసితులు, సెక్యూరిటీ గార్డులు జోక్యం చేసుకోవడంతో వారిపై కూడా చేయిచేసుకున్నారని అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వారు తెలిపారు. సొసైటీకి చెందిన అజిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, తన స్నేహితుడి భార్యతో బలవంతంగా సెల్ఫీలు దిగేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీనికి వారు అభ్యంతరం చెప్పడంతో ఆ వ్యక్తులు అతడిని, అతని స్నేహితుడు రితేష్‌ను కొట్టారు. కొందరు స్థానికులు జోక్యం చేసుకుని తమను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు దాడిలో మరికొందరు గాయపడ్డారని అజిత్ కుమార్ చెప్పారు. నలుగురిని ఆసుపత్రిలో చేర్చినట్లు… కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.