Site icon NTV Telugu

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియం ఈజ్ బ్యాక్.. బెంగళూరు గడ్డపై ఐపీఎల్ 2026 రచ్చ!

Chinnaswamy Stadium

Chinnaswamy Stadium

Chinnaswamy Stadium: బెంగళూరులోని ఐకానిక్ ఎం.చిన్నస్వామి స్టేడియంలోకి ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తిరిగి రాబోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) తాజాగా చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ నుంచి అధికారిక అనుమతి పొందింది. అయితే ఈ ఆమోదం కొన్ని షరతులు, నిబంధనలతో వస్తుంది, కచ్చితంగా వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

READ ALSO: Marriage Incentive: దివ్యాంగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. వివాహ ప్రోత్సాహకం భారీగా పెంపు

ఇదే టైంలో KSCA ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. భద్రత, జనసమూహ నిర్వహణ, స్టేడియం కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అవసరాలకు సంబంధించి నిపుణుల సమీక్ష కమిటీకి ఇప్పటికే వివరణాత్మక రోడ్‌మ్యాప్‌ను సమర్పించినట్లు ఈ ప్రెస్ నోట్‌లో KSCA విడుదల చేసింది. “ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్దేశించిన షరతులకు లోబడి అనుమతి ఉంటుంది. KSCA అన్ని నిబంధనలను పూర్తిగా పాటిస్తుందని విశ్వసిస్తోంది” అని ఈ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియమితులైన కెఎస్‌సిఎ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ తన పదవీకాలంలో స్టేడియం పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే టైంలో డిసెంబర్‌లో కర్ణాటక క్యాబినెట్ ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి షరతులతో కూడిన ఆమోదం లభించింది. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక ఆమోదంతో చిన్నస్వామి స్టేడియం మరోసారి ప్రేక్షకులకు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉందని స్పష్టమైంది.

జూన్ 4, 2025న నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ కవాతు సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ సంఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలో ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లు నిలిపివేశారు. 2025-26 విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు కూడా చిన్నస్వామిలో జరగలేదు. 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్, రాబోయే పురుషుల T20 ప్రపంచ కప్‌కు బెంగళూరును వేదికగా ఎంపిక చేయలేదు. ఐసిసి టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ వేదికకు అంతర్జాతీయ మ్యాచ్‌లు తిరిగి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఈ సంవత్సరం జరిగే ఐపీఎల్‌లో చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. చాలా కాలంగా తమ అభిమాన మైదానంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బెంగళూరులోని క్రికెట్ అభిమానులకు ఇది చాలా సంతోషం కలిగించే వార్తగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

READ ALSO: Indian Rupee Fall: కరెన్సీ మార్కెట్‌ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో రూపాయి పతనం! రీజన్స్ ఇవే..

Exit mobile version