Journalist Zhang Zhan: ఈ ఆధునిక యుగంలో సంభవించిన అతి పెద్ద వినాశనాల్లో కరోనా వైరస్ ముందు వరుసలో ఉంటుంది.. ఈ వైరస్ ఎక్కడో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. చైనాలో కరోనా వైరస్ గురించి మొదట నివేదించిన మహిళా జర్నలిస్టు పాపం ఇప్పుడు ఆ దేశంలో నరకం అనుభవిస్తుంది. ఆమె గత నాలుగేళ్లుగా చైనా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనేందుకు చైనా ఎప్పుడూ ఇష్టపడలేదు.. అలాంటిది తమ దేశంలో వైరస్ వ్యాప్తిని ప్రపంచం ముందు పెట్టిన కారణంగా ఆమెను చైనా ప్రభుత్వం తీవ్రంగా హింసిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: ఇవాల సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా..
జాంగ్ ఝాన్ అనే ఈ మహిళా జర్నలిస్ట్ చైనాలో వ్యాపిస్తున్న ప్రమాదకరమైన వైరస్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా, ఫోటోలు, వీడియోలను పంచుకోవడం ద్వారా చైనాలోని వైరస్‌ను బహిర్గతం చేసింది. దీనితో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం మొదట జాంగ్‌కు నాలుగు ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజా మళ్ళీ ఇప్పుడు ఆమెకు మరో నాలుగు సంవత్సరాలు జైలుకు పంపారు. పలు నివేదికల ప్రకారం.. 42 ఏళ్ల జాంగ్ ఝాన్ పై చైనాలో హింసను ప్రేరేపించడం, అశాంతిని సృష్టించడం వంటి అభియోగాలు మోపి, ఆమెకు మరో నాలుగు ఏళ్ల జైలు శిక్ష విధించారు. 2020 డిసెంబర్‌లో కూడా ఇవే ఆరోపణలపై ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మొదటి సారి జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ మహిళ జర్నలిస్టు జాంగ్ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించగా.. పోలీసులు ఆమె చేతులు, కాళ్లను కట్టివేసి, బలవంతంగా ట్యూబ్ ద్వారా ఆహారం తినిపించినట్లు ఆమె చెప్పారు. జాంగ్ మే 2024లో విడుదలయ్యారు.. కానీ పాపం ఆమెను తిరిగి మూడు నెలల తర్వాత మళ్లీ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమెను అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రపంచానికి చెప్పి షాంఘైలోని పుడాంగ్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. చైనాలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం పరిస్థితి సాధారణంగానే ఉందని నటిస్తూ ప్రపంచాన్ని మోసం చేసింది. ఈ సమయంలో జాంగ్ వీడియోలు, చిత్రాల ద్వారా చైనా వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించారు. దీనికి ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆమెపై కన్నెర్ర చేసి నాటి నుంచి హింసలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనాలో జర్నలిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. RSF 2025లో 180 దేశాలలో నిర్వహించిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ జాబితాలో చైనా 178వ స్థానంలో ఉందని వెల్లడైంది. జర్నలిస్టులకు ప్రపంచంలోనే అతిపెద్ద జైలుగా RSF చైనాను పేర్కొంది. చైనాలో దాదాపు 124 మంది మీడియా ఉద్యోగులు ఇప్పటికి జైలులో మగ్గుతున్నారని సమచారం.
READ ALSO: China J-35A: ప్రపంచానికి సవాల్ విసురుతున్న.. చైనా ‘సైలెంట్ కిల్లర్’
