Char Dham Yatra Closing Dates: చార్‌ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!

  • 2026 చార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలు ఖరారు
  • నవంబర్‌లో శీతాకాలం కోసం ఆలయాల తలుపులు మూసివేత
  • నవంబర్ 10న గంగోత్రి ఆలయ మూసివేత
  • నవంబర్ 11న కేదార్‌నాథ్ ఆలయ మూసివేత
  • నవంబర్ 11న యమునోత్రి ఆలయ మూసివేత
  • నవంబర్ 16న బద్రీనాథ్ ఆలయ మూసివేత..
Char Dham Yatra

Char Dham Yatra

Char Dham Yatra: హిందూ సనాతన ధర్మంలో చార్‌ధామ్ యాత్రకు ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను కలిపి చార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భగవంతుని దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే.. శీతాకాలం సమీపిస్తుండటంతో ఈ నాలుగు దివ్యధామాల తలుపులను మూసివేసే సమయం ఆసన్నమైంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆలయాల మూసివేత తేదీలు ఖరారయ్యాయి.

నాలుగు ధామాల మూసివేత తేదీలు:

శీతాకాలం దృష్ట్యా నవంబర్ మధ్య నాటికి చార్‌ధామ్ యాత్ర ముగియనుంది. నాలుగు క్షేత్రాల కవాటాలు వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సమయాల్లో మూసివేయనున్నారు. మరి అవి ఎప్పుడు.? ఆ సమయానికి అంటే..

గంగోత్రి ధామం: నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12:05 గంటలకు మూసివేస్తారు.

కేదార్‌నాథ్ ధామం: నవంబర్ 11వ తేదీన ఉదయం 8:30 గంటలకు మూసివేస్తారు.

యమునోత్రి ధామం: నవంబర్ 11వ తేదీన భగినీ హస్తభోజనం (భయ్యా దూజ్) పర్వదినం సందర్భంగా ఉదయం 10:28 గంటలకు తలుపులు మూసివేస్తారు.

బద్రీనాథ్ ధామం: నవంబర్ 16వ తేదీన రాత్రి 9:37 గంటలకు ఆలయ తలుపులను మూసివేస్తారు.

చార్‌ధామ్ యాత్రను ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీకగా భావిస్తారు. ఈ యాత్రలో భక్తులు యమునా దేవి, గంగా మాత, పరమశివుడు, శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. స్వచ్ఛమైన మనసుతో చేసే ఈ తీర్థయాత్ర మనుషులను ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి చేసి మోక్ష మార్గం వైపు నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే ఎముకలు కొరికే చలి, కఠినమైన కొండ మార్గాలు, వాతావరణ సవాళ్లు ఎదురైనా భక్తులు ఏమాత్రం వెనుకాడకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుంటారు.

సాంప్రదాయం ప్రకారం చార్‌ధామ్ యాత్రను ఒక నిర్దిష్ట పద్ధతిలో క్రమపద్ధతిగా పూర్తి చేస్తారు. ఈ యాత్రలో మొదటి మజిలీ యమునోత్రి. ఉత్తరకాశీ జిల్లాలో కొలువైన యమునా దేవిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు లభిస్తాయని విశ్వసిస్తారు. భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రెండో విడతగా గంగోత్రి ధామాన్ని దర్శిస్తారు. ఇది కూడా ఉత్తరకాశీ జిల్లాలోనే ఉంది. హిందూ సంప్రదాయంలో గంగానది మోక్షప్రదాయిని. గంగామాతను దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని నమ్ముతారు.

మూడో మజిలీ పరమశివుని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్. రుద్రప్రయాగ్ జిల్లాలోని హిమాలయ పర్వత శ్రేణుల మధ్య వెలసిన ఈ ఆలయానికి చేరుకోవడానికి కఠినమైన కొండ మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక చార్‌ధామ్ యాత్రలో చివరిది, పరిపూర్ణమైనది బద్రీనాథ్ ధామం. చమోలీ జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీమహావిష్ణువు బద్రీ నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్ర దర్శనంతో యాత్ర సంపూర్ణమై భక్తులకు పుణ్యఫలం, మోక్షం లభిస్తాయని విశ్వసిస్తారు.