Site icon NTV Telugu

CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యం..

Cm Chandrababu Nellore

Cm Chandrababu Nellore

CM Chandrababu Naidu: ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఉంది. అలాగే వెల్‌నెస్ సెంటర్, యోగా చేసుకునేందుకు సౌకర్యం, హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ స్టేడియం వంటివి ఉన్నాయి. వీటిని దాజీతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అలాగే శాంతివనంలో జరుగుతోన్న శాస్త్రీయ, వృక్షశాస్త్ర పరిశోధనల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. శాంతి వనంలో చేపడుతున్న జీవ వైవిధ్యం, పర్యావరణ కార్యక్రమాలను వీక్షిస్తూ సీఎం చంద్రబాబు రెయిన్‌ఫారెస్ట్‌ను సందర్శించారు.

READ MORE: Indian Economy: జనాభాలో అగ్రస్థానంలో ఉన్న 10% మంది వద్ద 65% సంపద.. అయినా ఈ చిన్న దేశం కంటే వెనుకబడ్డ భారత్

రెయిన్ ఫారెస్ట్ రూపకల్పన, దానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సీఎంకు దాజీ వివరించారు. అలాగే ధ్యాన మందిరం వెలుపల ఉన్న వర్షపు నీటి సంరక్షణ ప్రాంతమైన బాబూజీ వనాన్ని సీఎం సందర్శించారు. హార్ట్‌ఫుల్‌నెస్ గోపీచంద్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అకాడమీని, ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…కన్హా శాంతి వనంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే వాతావరణం ఉందన్నారు. విద్యా రంగంలో కొత్త ప్రమాణాలు పాటిస్తూ… హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయన్నారు. కన్హా శాంతి వనం స్వర్గాన్ని తలపించేలా ఉందని, పర్యావరణాన్ని కాపాడుతూ శాంతి వనాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతమని వ్యాఖ్యానించారు. రేపటి తరం నాయకులను తీర్చిదిద్దేలా హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నెషనల్ స్కూల్ నడుపుతున్నారని సీఎం ప్రశంసించారు. ఏపీ ముఖ్యమంత్రి శాంతివనాన్ని సందర్శించడం సంతోషాన్నిస్తోందని శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీ అన్నారు. అలాగే విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో సేవలను అందిస్తున్నామని దాజీ తెలిపారు.

READ MORE: Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version