కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు జులై 2026 నుంచి అమలులోకి రావలసిన కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) పెంపు వార్త కోసం ఈ పండగ సీజన్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏపై కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ ప్రతిపాదన కనుక ఖరారైతే కేంద్ర ఉద్యోగుల డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి చేరుతుంది. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ వేతనంలో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించనుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి కనీస ప్రాథమిక వేతనం రూ.18,000 ఉంటే, ప్రస్తుతం పొందుతున్న రూ.10,800 డీఏ స్థానంలో ప్రతి నెలా రూ.11,340 లభిస్తుంది. అంటే వారి నెలకు రూ.540 చొప్పున అదనపు ప్రయోజనం కలుగుతుంది.
ఈ పెంపుదల జులై 2026 నుంచి అమల్లోకి వస్తే, ఉద్యోగులకు జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన 3 నెలల అరియర్స్ కూడా ఒకేసారి చెల్లించే అవకాశం ఉంటుంది. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, పండుగ కానుకగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను త్వరలోనే చేస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి.
గత ఐదేళ్ల చరిత్రను పరిశీలిస్తే జులై కాయిన్ డీఏ పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం సాధారణంగా సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ నెలలోనే ప్రకటించడం పరిపాటిగా వస్తోంది. ఈ దఫా ప్రకటన ఆలస్యమైనప్పటికీ, దీపావళికి ముందే కేంద్ర మంత్రివర్గం నుంచి అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. అయితే పెంపు శాతం, అమలు తేదీ, బకాయిల చెల్లింపుపై తుది స్పష్టత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వుల ఆధారంగానే లభిస్తుంది.

