Khalistani Arrest: ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నుకు అత్యంత సన్నిహితుడు, అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ)లో కీలక పాత్ర పోషిస్తున్నా ఇందర్‌జిత్ సింగ్ గోసల్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగి ఉండటంతో పాటు పలు కేసుల్లో భాగంగా ఇందర్‌జిత్ సింగ్ గోసల్‌ను కెనడాలోని ఒట్టావాలో అక్కడి పోలీలసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
READ ALSO: GST 2.0 అమల్లో ఈ వస్తువులపై ధరల్లో భారీ తగ్గింపు !
2023 నుంచి SFJ బాధ్యతలు..
కెనడా నివాసి అయిన ఇందర్‌జిత్.. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత జూన్ 2023లో నుంచి SFJ మొత్తం బాధ్యత నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో, గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు కెనడియన్ పోలీసులు ఇంద్రజిత్‌ను అరెస్టు చేశారు. ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన హిందువులను కూడా అతను లక్ష్యంగా చేసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కెనడాలో ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణకు వేదికను సిద్ధం చేయడంలో ఇందర్‌జిత్ కీలక పాత్ర పోషించారని కెనడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇందర్‌జిత్‌ను పన్ను కుడిభుజంగా భావిస్తారు. తాజాగా ఇందర్‌జిత్ అరెస్ట్‌తో గుర్పత్వంత్ సింగ్ పన్నుకు పన్ను ఊడిపోయినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కెనడా భారత్ మధ్య కొత్త అధ్యాయం..
2023లో కెనడాలో ఒక సిక్కు వేర్పాటువాది హత్య అనంతరం కెనడా భారత దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు అంగీకారం కుదిరిందని ఇటీవల ఇండియా విదేశాంగశాఖ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ప్రస్తుతం ఇరు దేశాలు.. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజా పరిణామం వెలుగు చూడటం గమనార్హం.
READ ALSO: Jacqueline Fernandez: సుప్రీంకోర్టులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ..
