బెంగళూరులో ఘోరం జరిగింది. 21 ఏళ్లకే ఓ విద్యార్థినికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కాలేజీకి వెళ్లి తిరిగి రావాల్సిన ఓ స్టూడెంట్‌ను బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. ఓ నిండు ప్రాణం బస్సు చక్రాల కింద నలిగిపోయింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
21 ఏళ్ల కుసుమిత అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఉదయాన్నే స్కూటీపై కాలేజీకి బయల్దేరింది. దేవయ్య పార్కు సమీపంలో బస్సును దాటతుండగా బైక్ అదుపుతప్పి చక్రాల కిందకు వెళ్లిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 15 అడుగుల మేర కుసుమితను ఈడ్చికెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
కుసుమిత మల్లేశ్వరం 13వ క్రాస్‌లో నివాసం ఉంటుంది. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో మూడో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం యధావిథిగా కాలేజీకి బయల్దేరింది. శివాజీనగర్ నుంచి కమలానగర్ వెళ్తున్న బస్సు దేవయ్య పార్కు సమీపంలో విద్యార్థి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. అంతే కుసుమిత బ్యాలెన్స్ తప్పి, ద్విచక్ర వాహనంతో పాటు బస్సు కింద పడి పోయింది. స్థానికులు బస్సును ఆపమని కేకలు వేసినా.. అప్పటికే బస్సు 15 అడుగులు ఈడ్చికుని తీసుకెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటి స్నేహితురాలు కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో విద్యార్థులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు