NTV Telugu Site icon

ప్రధాని మోడీకి బండి సంజయ్ కృతజ్ఞతలు

Bandi Sanjay

కాకతీయుల కళాత్మక వైభవానికి చిహ్నం, 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా సాధించేందుకు కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదపడంతో చైనాలో జరిగిన యునెస్కో సమావేశం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువైన ప్రఖ్యాత రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి సంబంధించి నామినేషన్‌ 2019లో దాఖలు కాగా, అదే ఏడాది రామప్పను సందర్శించిన ‘అంతర్జాతీయ స్మారకాలు, స్థలాల మండలి (ఐసీవోఎంవోఎస్‌)’ తొమ్మిది లోపాలను ఎత్తిచూపిందని తెలిపారు. దీంతో భారత్‌ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించి ప్రపంచ వారసత్వ కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) ఓటింగ్‌లో పాల్గొననున్న దేశాలకు రామప్ప గొప్పతనాన్ని వివరించిందన్నారు. దానికి యునెస్కో గుర్తింపు దక్కాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిందని… దీంతో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కృషితోనే రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు.