Site icon NTV Telugu

Budget 2026: పాత పన్ను విధానం తొలగింపు..? వేతన జీవులకు గుడ్‌న్యూస్‌..!

Nirmala Sitharaman Budget

Nirmala Sitharaman Budget

Budget 2026: బడ్జెట్‌ 2026-27 ఎలా ఉండబోతోంది? అనేదానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.. అయితే, బడ్జెట్‌ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జీతం పొందే వర్గం దృష్టి మొత్తం ఆదాయపు పన్ను విధానంలో వచ్చే మార్పులపైనే ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఇందులో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం ప్రామాణిక మినహాయింపుతో కలిపి ₹12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. ఇప్పటికే దాదాపు 95 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న నేపథ్యంలో, పాత పన్ను విధానానికి భవిష్యత్తు ఏమిటనే చర్చ మొదలైంది.

Read Also: Supreme Court: కోర్ట్ ధిక్కరణ కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు

నిజానికి ప్రభుత్వం ఇప్పటికే కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ ఆప్షన్‌గా మార్చింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ దృష్టి పూర్తిగా కొత్త పన్ను విధానంపైనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ 2026లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించే ప్రకటన రావచ్చా అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బడ్జెట్‌లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం అసంభవమే. కానీ, దానిని క్రమంగా ప్రాధాన్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పన్ను విధానంలో జరుగుతున్న మార్పులను పరిశీలిస్తే, ప్రభుత్వం సరళమైన, తక్కువ మినహాయింపులు కలిగిన, వివాదాలు లేని పన్ను వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

కొత్త పన్ను విధానం తక్కువ పన్ను స్లాబ్‌లు, ఎక్కువ మినహాయింపుల తొలగింపు అనే సూత్రాలపై ఆధారపడి ఉంది. అయితే, గృహ రుణాలు, హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌ఐసీ, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్ వంటి పెట్టుబడులు ఉన్నవారికి ఇప్పటికీ పాత పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటోంది. బడ్జెట్‌ 2026లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మిగిలిన పన్ను చెల్లింపుదారులు కూడా పాత విధానాన్ని వదిలి కొత్త విధానానికి మారే అవకాశం ఉంటుంది.

కొత్త పన్ను విధానంలో ఊరట చర్యలు?
కాగా, ప్రధానంగా ప్రామాణిక మినహాయింపును పెంచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.75,000 ప్రామాణిక మినహాయింపు అందుబాటులో ఉంది. దీనిని ప్రభుత్వం రూ.1 లక్షకు పెంచితే జీతం పొందే వర్గానికి నేరుగా లాభం చేకూరుతుంది. అలాగే, కొత్త పన్ను విధానంలో.. ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్)ను చేర్చే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పాత పన్ను విధానంలో ఎన్‌పీఎస్‌పై అదనంగా రూ.50,000 మినహాయింపు లభిస్తుంది. కానీ ఈ సదుపాయం కొత్త పన్ను విధానంలో లేదు. యజమాని సహకారాన్ని పన్ను మినహాయింపులోకి తీసుకువస్తే, పదవీ విరమణ పొదుపులకు ఇది గణనీయంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక పాత పన్ను విధానంలో జీతం పొందే వారికి రూ.50,000 ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80C కింద పీఎఫ్, ఎల్‌ఐసీ, ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై మినహాయింపు, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా, హెచ్‌ఆర్‌ఏ, గృహ రుణ వడ్డీపై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో పన్ను స్లాబ్‌లు కూడా ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా చూస్తే, బడ్జెట్‌ 2026లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త పన్ను విధానాన్ని మరింత బలంగా ప్రోత్సహించే నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది.

Exit mobile version