BSNL దూకుడు.. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్‌..

Bsnl

Bsnl

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL.. దేశంలోని టాప్ టెలికం సంస్థలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కు షాకిచ్చింది.. తక్కువ ధరల్లోనే టారిఫ్‌లు తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ టెలికాం సంస్థలను దెబ్బకొట్టినంత పనిచేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానా మొబైల్ మార్కెట్‌లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL జూలై 2026లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌ల కంటే ఎక్కువ మంది కొత్త వినియోగదారులను BSNL తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంది. తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు, మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా సబ్‌స్క్రిప్షన్ నివేదిక ప్రకారం.. జూన్ 2026 చివరి నాటికి హర్యానాలో BSNLకు 46,49,224 మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. జూలై చివరి నాటికి ఈ సంఖ్య 47,17,784కు చేరుకుంది. అంటే ఒక్క నెలలోనే 68,560 మంది కొత్త వినియోగదారులు BSNL నెట్‌వర్క్‌లో చేరారు.

జియో, ఎయిర్‌టెల్ కంటే ముందంజ
కొత్త మొబైల్ వినియోగదారుల చేరికలో BSNL హర్యానాలో జియో, ఎయిర్‌టెల్‌లను అధిగమించింది. జూన్‌లో జియోకు 82,70,811 మంది వినియోగదారులు ఉండగా.. జూలై చివరికి ఈ సంఖ్య 83,08,319కు పెరిగింది. అంటే జియోకు 37,508 మంది కొత్త వినియోగదారులు మాత్రమే చేరారు. అదే సమయంలో ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 79,38,962 నుంచి 79,64,101కు పెరిగింది. దీంతో జూలైలో ఎయిర్‌టెల్ 25,139 మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఈ రెండు సంస్థలతో పోలిస్తే BSNL కొత్త వినియోగదారుల చేరికలో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

BSNL వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైన నేపథ్యంలో BSNL అందిస్తున్న తక్కువ ధర ప్లాన్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలను పొందాలనుకునే వారికి BSNL అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా మారుతోంది. మరోవైపు BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీంతో సరసమైన ధరతో పాటు మెరుగైన నెట్‌వర్క్ సేవలను కోరుకునే వినియోగదారులు BSNL వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో మరింత పోటీ?
తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్లు, 4G సేవల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన నెట్‌వర్క్ వంటి అంశాలు BSNLకు కలిసొస్తున్నాయి. హర్యానాలో జూలై నెల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ప్రైవేట్ టెలికాం సంస్థలకు BSNL నుంచి మరింత పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.