మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? అయితే ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కంపెనీలు సరికొత్త ఈవీ కార్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో అందరూ మైలేజ్, అలాగే బ్యాటరీ రేంజ్ ఎక్కువ ఇచ్చే కార్ల వైపు చూస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం ప్రయాణించే కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) ఒక అద్భుతమైన కొత్త మోడల్‌ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసింది.
ప్రముఖ బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ తన సరికొత్త ఐఎక్స్4 (iX4) ఎలక్ట్రిక్ కూపే-ఎస్‌యూవీ కారును గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 828 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి రేంజ్ ఆందోళన లేకుండా ఈ కారును డిజైన్ చేశారు. కంపెనీ రూపొందించిన కొత్త ‘నోయ్ క్లాస్’ ప్లాట్‌ఫారమ్‌పై తయారైన మూడో ఎలక్ట్రిక్ మోడల్ ఇది.
ఈ బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్4 కారును మార్చి 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రారంభంలో ఇది 40 ఎక్స్‌డ్రైవ్, 50 ఎక్స్‌డ్రైవ్ వేరియంట్లలో రానుంది. ఆ తర్వాత టాప్ మోడల్ అయిన ఐఎక్స్4 ఎం60 ఎక్స్‌డ్రైవ్‌ను విడుదల చేయనున్నారు. ఈ కారులో కొత్త తరం 800 ఓల్ట్ ఈడ్రైవ్ టెక్నాలజీని వాడారు. దీనివల్ల కారు బ్యాటరీ చాలా వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్, మైండ్ బ్లావింగ్ రేంజ్‌తో రానున్న ఈ కారు ఈవీ ప్రియులను బాగా ఆకట్టుకోనుంది.

