Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!

Bihar

Bihar

Success Story: నాలుగు గోడలకే పరిమితమై, ఇంటి పనుల్లో మునిగి తేలే ఒక సాధారణ గృహిణి.. తన చేతిలోని నైపుణ్యంతో ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మొదలుపెడితే ఎలా ఉంటుందో ఓ మహిళ నిరూపించారు. ఆమె ఎవరో కాదు.. బీహార్‌ రాష్ట్రం పాలిగంజ్‌లోని ముంగిలా గ్రామానికి చెందిన అపర్ణ.. తొలుత అపర్ణ పట్టు దారాలతో గాజులు తయారు చేసేది. ఇలా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట్లో తనే వేసుకోవడానికి సరదాగా ప్లాస్టిక్ గాజులపై పట్టు దారాలు చుట్టి, ఆపైన అందమైన రాళ్లు, పెయింటింగ్స్‌తో గాజులు రూపొందించేవారు. వీటిని చూసిన చుట్టుపక్కల వారు, బంధువులు మెచ్చుకోవడంతో.. తనలో ఉన్న కలనే ఒక వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే ‘అపర్ణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’. సుమారు మూడేళ్ల క్రితం దీన్ని పూర్తిస్థాయి వ్యాపారంగా మలిచిన అపర్ణ, నిజానికి అంతకు ముందు నుంచే చేతివృత్తుల పనులు చేసేవారు. ఆమె అమ్మిన మొదటి గాజుల సెట్ ధర కేవలం 150 రూపాయలు. కానీ ఈ రోజున ఆమె వార్షిక విక్రయాలు ఏకంగా 8 నుంచి 10 లక్షల రూపాయల స్థాయికి చేరుకున్నాయి. సిల్క్ త్రెడ్ జ్యువెలరీతో పాటు జ్యూట్ (జనపనార) వస్తువులు, ఇల్లు అలంకరించుకునే హోమ్ డెకోర్ ఉత్పత్తులను కూడా ఆమె తయారు చేస్తున్నారు. వీటికి మంచి మార్జిన్ (లాభం) కూడా వస్తుండటం విశేషం.

అపర్ణ తయారుచేసే ప్రొడక్ట్స్ ప్రత్యేకత ఏంటంటే.. అవన్నీ పూర్తిగా చేతితో తయారుచేసినవి (హ్యాండ్ మేడ్). ప్లాస్టిక్ గాజులకి రేషమ్ దారాలు చుట్టి, వాటిపై డిజైన్లు వేయడమే కాకుండా కొన్నింటిపై ప్రసిద్ధ మధుబని పెయింటింగ్స్ కూడా వేస్తారు. అంతేకాకుండా, నెక్లెస్‌లలో ఉండే చిన్న చిన్న పూసలకు సైతం దారాలు పినోచి, పెయింటింగ్స్ చేస్తారు. ఈ మధుబని పెయింటింగ్ జ్యువెలరీ సెట్స్ రూ.1200 నుంచి రూ.2200 వరకు అమ్ముడవుతాయి. ఇవన్నీ ఎంతో శ్రమతో కూడుకున్నవి కావడం వల్లే వాటికి ఆ స్థాయిలో ధర ఉంటుంది. ఇటీవల ఆమె తల్లి తయారుచేసే క్రోషా (Crochet) ఉత్పత్తులను కూడా వ్యాపారంలోకి తీసుకొచ్చారు.

వ్యక్తిగత అవసరాల కోసం మొదలైన ఈ చిన్న ఆలోచన, ఈ రోజు 6-7 మందికి ఉపాధినిచ్చే స్థాయికి పెరిగింది. తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సహకారంతో ఈ వ్యాపారాన్ని నడుపుతున్న అపర్ణ.. పర్యావరణానికి మేలు చేసే ‘ఈకో-ఫ్రెండ్లీ’ ఉత్పత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈమె తయారుచేసే జ్యూట్ పిట్ట గూడు (జ్యూట్ నెస్టెడ్ ప్రొడక్ట్) అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రొడక్ట్‌గా నిలిచింది. ఇటీవల పట్నా సరస్ మేళాలో కూడా ఈ జ్యూట్ గూళ్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం అపర్ణకు ప్రత్యేకంగా ఒక షాప్ లేకపోయినా, డిజిటల్ మార్కెటింగ్‌ని చక్కగా ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా తమ ఉత్పత్తులను ప్రపంచానికి చూపిస్తూ ఆర్డర్లు సాధిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు పెద్ద మొత్తంలో బల్క్ ఆర్డర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ప్రయాణంలో తనకు ఐదేళ్లుగా ‘జీవిక’ (Jeevika) సంస్థ ఎంతో తోడ్పడిందని అపర్ణ సంతోషంగా చెప్తారు. ప్రొడక్ట్స్ తయారుచేయడం నుంచి ప్రదర్శనలు, మేళాల ద్వారా సరైన ప్లాట్‌ఫారమ్ కల్పించడం వరకు జీవిక తనకు కొండంత అండగా నిలిచిందని, ఒక సాధారణ గృహిణిగా ఉన్న తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఎంతో గర్వంగా చెబుతున్నారు.