ఐపీఎల్ 2008 సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. హర్భజన్.. శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటనకు సంబంధించిన వీడియోను 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తాజాగా షేర్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ పాడ్ కాస్ట్ సందర్భంగా అప్పటి వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. జనాలు మర్చిపోయిన ఈ ఘటనను లలిత్ మోడీ మరోసారి గుర్తుచేశాడు. ఈ వీడియోపై శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి ఫైర్ అయ్యారు. మీరు అసలు మనుషులేనా?.. కాస్తైనా సిగ్గుండాలి అంటూ లలిత్ మోడీ సహా క్లార్క్‌పై మండిపడ్డారు.
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ 2008లో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ పేసర్ శ్రీశాంత్ మధ్య గొడవ జరిగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ (10వ మ్యాచ్) తర్వాత ప్లేయర్స్ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో.. శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చేయిచేసుకున్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రసారకులు ఆ ఫుటేజ్‌ను చూపించలేదు. శ్రీశాంత్ ఏడుస్తున్న ఫుటేజ్‌ను మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఆ సంఘటనకు హర్భజన్ చాలాసార్లు క్షమాపణలు చెప్పాడు. తన జీవితంలో ఏదైనా మార్చడానికి అవకాశం వస్తే.. ఆ తప్పును సరిదిద్దుకుంటానని తెలిపాడు. ఈ సంఘటనను తాను ఎప్పుడో వదిలేశానని శ్రీశాంత్ కూడా చాలాసార్లు చెప్పాడు. ఇద్దరు కలిసి భారతదేశం తరపున కలిసి క్రికెట్ ఆడారు, కామెంటరీ బాక్స్‌లో కూడా కనిపించారు. అందరూ మర్చిపోయిన ఈ ఘటనపై లలిత్ మోడీ వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరి కుమారి ఫైర్ అయ్యారు.
Also Read: Ambati Rambabu: చంద్రబాబుకు అసలు పోలవరం గురించి ఏమీ తెలియదు.. చర్చకు మేం సిద్ధం!
‘లలిత్ మోడీ, మైఖేల్ క్లార్క్ మీరు చేసిన పనికి సిగ్గుపడాలి. వ్యూస్, పబ్లిసిటీ కోసం 2008 సంఘటనను మరలా వెలుగులోకి తెచ్చారు. మీరు మనుషులు కాదు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ఇద్దరూ ఈ సంఘటనను మరిచిపోయి.. జీవితంలో ముందుకు సాగారు. ఇప్పుడు వారికి స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఇది ముమ్మాటికి అసహ్యకరమైన, క్రూరమైన, అమానవీయ చర్య. మీరు చేసిన ఈ పని హర్భజన్, శ్రీశాంత్ మాత్రమే కాకుండా వారి కుటుంబాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలు సూల్స్‌లో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కారణంగా చేయని తప్పుకు పిల్లలు శిక్షను అనుభవించాలా?. ఇంత దారుణంగా వ్యవహరించిన మీపై కేసు పెట్టాలి. శ్రీశాంత్ గొప్ప వ్యక్తి. ఇలాంటి వీడియోలు అతని గౌరవాన్ని తగ్గించలేవు’ అని భువనేశ్వరి కుమారి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
