Best Horror Movies: మనాలి చాలామందికి హారర్ సినిమాలు చూడటం అంటే బాగా ఇష్టం. దెయ్యాలు, మిస్టరీలు, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వెన్నులో వణుకు పుట్టించే సినిమాల కోసం చాలామంది తెగ వెతుకుంటారు. అయితే అలాంటివారికోసం ఈ లిస్ట్. ఓటీటీలో అందుబాటులో ఉన్న కొన్ని హారర్ సినిమాల్లో కథ, టేకింగ్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలను ఇప్పుడు చూద్దాం..
తుంబాడ్ (Tumbbad):
భారతీయ సినిమాల్లో బెస్ట్ హారర్ చిత్రాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే సినిమాల్లో తుంబాడ్ (Tumbbad) ఒకటి. రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మొదట పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి రోజున సుమారు రూ.65 లక్షలు మాత్రమే వసూలు చేసినప్పటికీ.. క్రమంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ కథ హస్తర్ అనే రహస్యమైన పాత్ర చుట్టూ తిరుగుతుంది. వినాయక్ రావు అనే వ్యక్తి పురాతన నిధి గురించి తెలుసుకుంటాడు. అయితే ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అతడు ఎదుర్కొనే పరిస్థితులు భయానకంగా ఉంటాయి. అత్యాశ కారణంగా వినాయక్ జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే కథకు ప్రధాన బలం. పురాణాలు, మిస్టరీ, హారర్‌ను కలిపి తెరకెక్కించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వాతావరణం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. సుమారు రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.17 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా “ప్రైమ్ వీడియో”లో స్ట్రీమింగ్ అవుతోంది.
ది అదర్స్ (The Others):
2001లో విడుదలైన అమెరికన్-స్పానిష్ చిత్రం ది అదర్స్ (The Others) సైకలాజికల్ హారర్ సినిమాలకు మంచి ఉదాహరణ. అలెజాండ్రో అమెనాబార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నికోల్ కిడ్‌మన్ ప్రధాన పాత్రలో నటించారు. గ్రేస్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ పాత, చీకటి ఇంట్లోకి వస్తుంది. పిల్లలకు వెలుతురు పడితే ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో ఇంట్లో ఎప్పుడూ కర్టెన్లు మూసే ఉంటాయి. అయితే కొంతకాలానికి గ్రేస్‌కు ఇంట్లో తాము మాత్రమే లేమనే అనుమానం మొదలవుతుంది. ఇంట్లో కర్టెన్లు వాటంతట అవే తెరుచుకోవడం, వింత శబ్దాలు వినిపించడం, తెలియని వ్యక్తుల ఉనికి వంటి సంఘటనలతో మిస్టరీ మరింత పెరుగుతుంది. ముఖ్యంగా సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జంప్ స్కేర్స్‌పై ఎక్కువగా ఆధారపడకుండా నెమ్మదిగా భయాన్ని పెంచే సినిమా ఇది.
13B: Fear Has a New Address:
భారతీయ హారర్ సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాల్లో 13B ఒకటి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2009లో విడుదలైన ఈ హిందీ-తమిళ ద్విభాషా చిత్రంలో ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించారు. మనోహర్ తన కుటుంబంతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తుకు మారుతాడు. అక్కడ వారి ఇంటి టీవీలో ‘సబ్ ఖైరియత్’ అనే సీరియల్ ప్రసారం అవుతుంది. అయితే ఆ సీరియల్‌లో చూపిస్తున్న సంఘటనలు తమ కుటుంబ జీవితంలో జరగబోయే విషయాల్లాగే ఉండటాన్ని మనోహర్ గమనిస్తాడు. మొదట ఇది యాదృచ్ఛికంగా భావించినప్పటికీ.. క్రమంగా పరిస్థితులు భయానకంగా మారుతాయి. ఆ టీవీ షో కేవలం సీరియల్ కాదని మనోహర్ తెలుసుకునే కొద్దీ కథ ఆసక్తికరంగా మారుతుంది. టీవీ షో కాన్సెప్ట్, 13వ నంబర్ చుట్టూ అల్లుకున్న మిస్టరీ ఈ సినిమాకు ప్రత్యేకమైన హారర్ అనుభూతిని అందిస్తాయి.
హెరెడిటరీ (Hereditary):
2018లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హారర్ చిత్రం హెరిడిటరీ (Hereditary) ప్రపంచంలోని భయానక సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆరి ఆస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆయన తొలి దర్శకత్వ చిత్రం కావడం విశేషం. గ్రాహమ్ కుటుంబంలోని పెద్ద మహిళ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు తమ కుటుంబానికి సంబంధించిన కొన్ని రహస్య విషయాలు తెలుస్తాయి. ఆ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడే కొద్దీ కుటుంబ సభ్యుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఓ దుష్ట కుట్ర కుటుంబాన్ని ఎలా చుట్టుముడుతుందనే అంశాన్ని సినిమా చూపిస్తుంది. పీమేన్ అనే రాక్షసుడికి సంబంధించిన ఆకల్ట్ అంశాలు కూడా కథలో కీలకంగా ఉంటాయి. టోనీ కొలెట్ నటన ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఇది సాధారణ జంప్ స్కేర్ హారర్ మూవీ కాదు. కుటుంబ విషాదం, మానసిక భయం, మిస్టరీ, ఆకల్ట్ అంశాలను కలిపి ప్రేక్షకుల్లో అసౌకర్యాన్ని, భయాన్ని కలిగించేలా సినిమాను తెరకెక్కించారు.
టాక్ టు మీ (Talk to Me):
2022లో విడుదలైన ఆస్ట్రేలియన్ సూపర్‌నేచురల్ హారర్ చిత్రం టాక్ టు మీ (Talk to Me). ఫిలిప్పౌ బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యువతను కేంద్రంగా చేసుకుని సరికొత్త హారర్ కాన్సెప్ట్‌ను చూపిస్తుంది. కొంతమంది స్నేహితులకు ఓ తెగిపోయిన చేయి దొరుకుతుంది. దాన్ని ఉపయోగించి ఆత్మలతో మాట్లాడటమే కాకుండా.. వాటిని తమ శరీరాల్లోకి ఆహ్వానించే ఆటను వారు ఆడుతుంటారు. మియా అనే యువతి ఈ గేమ్‌లోకి ఎక్కువగా వెళ్లడంతో క్రమంగా నిజ జీవితానికి, ఆత్మల ప్రపంచానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది. చిన్న తప్పు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. సుమారు 4.5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 92 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సైకలాజికల్ ఎలిమెంట్స్, ట్విస్టులు, సూపర్‌నేచురల్ హారర్‌తో ఈ సినిమా ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
హారర్‌లోనే విభిన్నమైన కథను కోరుకునే వారికి తుంబాడ్, స్లో బర్నింగ్ సైకలాజికల్ హారర్ కావాలంటే ది అదర్స్, కొత్త కాన్సెప్ట్‌తో ఇండియన్ హారర్ చూడాలంటే 13B, సైకలాజికల్ హారర్ కోసం హెరెడిటరీ, సూపర్‌నేచురల్ హారర్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం టాక్ టు మీ (Talk to Me) బెస్ట్.

