Republic Day History in Bastar: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లైంది. 200 ఏళ్ల పాటు అంటే ఓ పది తరాల పాటు సాగిన పరాయి పాలనలో మగ్గిపోయిన దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవటమే స్వాతంత్య్రం సాధించిన మొట్టమొదటి విజయం. జాతీయ పండుగలైన స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు ఏటా దేశ వ్యాప్తంగా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. కానీ.. ఛత్తీస్‌ఘడ్ బస్తర్ ప్రాంతంలో మాత్రం జాతీయ జెండా ఊసే ఉండేది కాదు.. ఎందుకంటే.. ఎన్నో దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాదం నీడలో జీవించిన ఈ ప్రాంతం ఇప్పుడు విముక్తి పొందింది. నిన్న (సోమవారం) జరిగిన గణతంత్ర దినోత్సవం సందర్భంగా చరిత్రాత్మక క్షణం బస్తర్‌లో కనిపించింది. ఇప్పటివరకు జాతీయ పండుగలు జరుపుకోవడం అసాధ్యంగా భావించిన గ్రామాల్లో తొలిసారి గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
READ MORE: Power star : పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై భూమిక కామెంట్స్
బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాలకు చెందిన మొత్తం 47 గ్రామాలు ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లైనా.. ఈ గ్రామాల్లో ఇప్పటివరకు జెండా ఎగరేసే పరిస్థితి లేదు. దానికి కారణం భయం. మావోయిస్టుల ప్రభావం, భద్రతా సమస్యలు ప్రజల చేతులను జెండా ఎగరేయకుండా కట్టి పారేశాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలిసారి ఈ గ్రామాల్లో త్రివర్ణ పతాకం ఎగిరింది. గ్రామస్థులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాలుగా బస్తర్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాయి. భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహించాయి. అదే సమయంలో స్థానిక ప్రజల సహకారం సైతం పెరిగింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 59 కొత్త భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటితో అక్కడ శాశ్వత భద్రతా వ్యవస్థతో పాటు ప్రభుత్వ ఉనికీ ఏర్పడింది.
ఈ మార్పు గతేడాదే మొదలైంది. అప్పట్లో 53 గ్రామాల్లో తొలిసారి గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈ ఏడాది మరో 47 గ్రామాలు ఆ జాబితాలో చేరాయి. ఒకప్పుడు “ఇక్కడ జెండా ఎగరేయడం ప్రమాదం” అని అనుకున్న ప్రాంతాల్లో, ఇప్పుడు ప్రజలే ముందుకు వచ్చి ప్రజాస్వామ్య వేడుకల్లో పాల్గొనడం నిజంగా పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ మార్పులపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందిస్తూ.. బస్తర్‌ను హింస నీడ నుంచి బయటకు తీసుకువచ్చి అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం శాంతి, నమ్మకం, ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.
