ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అత్యవసర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) కానుంది. కేజ్రీవాల్ నివాసంలో కేబినెట్ భేటీ జరగనుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు (Lok sabha Election) జరగనున్నాయి. అత్యధిక సీట్లు సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సన్నద్ధమవుతోంది. ప్రాముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఏడు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఆప్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఓటర్లపై వరాలు కురిపించేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అవుతోంది.
ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మరింత లబ్ధిపొందేందుకు విద్యుత్ సబ్సిడీ పథకాన్ని విస్తరించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 201-400 యూనిట్లు వాడే విద్యుత్ వినియోగదారులకు 50 శాతం సబ్సిడీ (Power subsidy) కల్పించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ ఎమర్జెన్సీ కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 201-400 యూనిట్లు విద్యుత్ ఉపయోగించే ప్రజలకు 50 శాతం రాయితీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఈనెల 16న ఈడీ విచారణకు హాజరుకావల్సిందేనని ఆదేశించింది. ఇప్పటికే ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. మరీ ఈసారైనా హాజరవుతారో లేదో చూడాలి.
