అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించగా, వారిలో 9 మందికి నూతన పోస్టింగ్‌లు, ఇద్దరికి పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతన నియమకాల వివరాల ప్రకారం.. 2002 బ్యాచ్‌కు చెందిన సౌరభ్ గౌర్ న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా డి. మురళీధర్ రెడ్డి, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా మంజుల బాలాజీ దిగంబర్ పోస్టింగ్ పొందారు. ఇక పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలి కాటా, యువజన సేవల సంచాలకుడిగా కె. నీలకంఠ రెడ్డి నియమితులయ్యారు.
అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా బి. అనిల్ కుమార్ రెడ్డి (2017 బ్యాచ్), సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఎన్. తేజ్ భరత్ (2018 బ్యాచ్) బాధ్యతలు చేపట్టనున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ ఉప కార్యదర్శిగా గెడేల శ్రీను కుమార్, ఏపీ పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వర ప్రసాద్‌లను ప్రభుత్వం నియమించింది. మరోవైపు పూర్తి అదనపు బాధ్యతల విషయానికి వస్తే.. హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకుడిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్ బన్సల్ ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ ఉత్తర్వులన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

