Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..

Ap Gov Logo

Ap Gov Logo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14వ తేదీని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా ప్రభుత్వం జనరల్ సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవు దినానికి బదులుగా నవంబర్ 14వ తేదీ రెండవ శనివారం అయినప్పటికీ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ విషయంలో తాజాగా కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం మరో మెమోను విడుదల చేసింది.

అక్టోబర్ 19న దసరా సెలవు రోజున ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు, విజయవాడలో జరిగిన సరస్ (SARAS) మేళా వంటి అధికారిక బాధ్యతలలో ఉన్న సిబ్బంది ఆ సెలవును పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఈ విషయాన్ని వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో, అప్పట్లో విధులకు హాజరైన ఆయా అర్హులైన ఉద్యోగులకు నవంబర్ 14న సెలవును వర్తింపజేయాలని నిర్ణయించారు.

సంబంధిత శాఖల అధిపతులు, కలెక్టర్లు , జిల్లా మేజిస్ట్రేట్లు ఈ వివరాలను పరిశీలించి కేవలం ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఆ రోజు సెలవు ఇవ్వాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఈ మినహాయింపు కేవలం ఎన్నికలు మరియు పండుగ సమయాల్లో విధులను నిర్వర్తించిన వారికే వర్తిస్తుందని, మిగిలిన ఉద్యోగులందరూ యథావిధిగా నవంబర్ 14న విధులకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది.