ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, భూ యజమానుల సుదీర్ఘకాల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపేందుకు స్పష్టమైన మార్గదర్శకాలతో జీవో నంబర్ జారీ చేసింది. ఈ నూతన జీవో ఉత్తర్వుల ప్రకారం.. ఫ్రీహోల్డ్ కోసం వచ్చే దరఖాస్తులను తహసీల్దార్ స్థాయి నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధి వరకు గరిష్టంగా 60 రోజుల వ్యవధిలోనే తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉంటుంది.
అలాగే నిషేధిత భూముల జాబితా నుంచి ఈ భూములను తొలగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన లేదా అదనపు ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత కలిగిన భూముల వివరాలను ఏపీ రెవెన్యూ పోర్టల్ అయిన ‘వెబ్‌ల్యాండ్’లో తక్షణమే మార్పులు చేసి అప్ డేట్ చేయాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ ను ఆదేశించింది.
ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా నిషేధిత జాబితాలో చిక్కుకుపోయిన భూములకు విముక్తి లభించనుంది. 60 రోజుల కాలపరిమితి కారణంగా రెవెన్యూ కార్యాలయాల్లో ఆలస్యం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. భూములపై పూర్తి హక్కులు రావడం వల్ల రైతులు తమ అవసరాలకు అనుగుణంగా భూములను విక్రయించుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి లేదా ఇతరులకు బదిలీ చేయడానికి మార్గం సుగమమవుతుంది.

