NTV Telugu Site icon

CM YS Jagan: తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు

Jagan

Jagan

CM YS Jagan: బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తుఫాన్‌ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తుఫాన్‌ నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్‌ పలు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Ambati Rambabu: టీడీపీ, జనసేనది అనైతిక కలయిక.. ఏపీ ప్రజలు క్షమించరు..

తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలన్నారు. కరెంట్‌, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.