NTV Telugu Site icon

Revanth Reddy Profile: కొండారెడ్డిపల్లి నుంచి సీఎం సీటు వరకు.. రేవంత్‌రెడ్డి ప్రస్థానం

Revanth Reddy 2

Revanth Reddy 2

Revanth Reddy Profile: రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్‌రెడ్డి.. ఏం మాట్లాడినా.. ఏ పార్టీలో ఉన్నా.. ఏం చేసినా సెన్సేషన్‌. తెలంగాణ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నాయకుడు. రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కు సరికొత్త ఊపిరిలూదిన నేత.. జడ్పీటీసీగా పొలిటికల్ ఇన్నింగ్స్‌ ప్రారంభించి నేడు రాష్ట్ర అధినేతగా మారారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా 20 ఏళ్ల పొలిటికల్ కెరీర్‌ కూడా లేని రేవంత్‌ అధ్యక్షుడయ్యాడంటే ఆయన స్టామినా ఏంటో అర్థమవుతుంది. నిజానికి ఏబీవీపీతో రేవంత్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత టీడీపీ ఆపై కాంగ్రెస్‌లో చేరి తక్కువ కాలంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఇక బీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీనే.. కాంగ్రెస్ కేవలం నామమాత్రమే అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి రిపేర్లు మొదలుపెట్టారు. కాంగ్రెస్ నేతలకు సరికొత్త దూకుడు నేర్పించాడు. ముఠాల కాంగ్రెస్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకొని.. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పోటాపోటీగా బహిరంగసభల్లో పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థుల తరపున 87 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించారు. గెలుపు వ్యూహాలు రచించారు. తన నాయకత్వ పటిమతో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జన నాయకుడు రేవంత్‌. నోటిఫికేషన్‌కు ముందు నుంచి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటూ బల్లగుద్ది చెప్పాడు. చెప్పడమే కాదు అది నిజమయ్యేలా చేశారు.

1969 నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు రేవంత్‌రెడ్డి. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. విద్యార్థి దశనుంచి రాజకీయాలపై మక్కువ ఎక్కువ. కొన్నిరోజులు ఏబీవీపీలో తిరిగారు. సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి బంధువు గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఏకైక కూతురు నైమిష. కొన్నాళ్లు ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా నిర్వహించారు.

కొన్నాళ్లు టీఆర్ఎస్‌లో కూడా పనిచేశారు రేవంత్‌.. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు. మిడ్జిల్ మండలం జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి.. సీనియర్ నేత గుర్నాథ్‌రెడ్డిని ఓడించారు. 2014లో మళ్లీ అదేస్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014-2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. 2017 అక్టోబరులో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో తక్కువ సమయంలోనే ముఖ్యనేతగా ఎదిగారు రేవంత్. 2018లో మరోసారి కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రేవంత్. ఆదే ఆయనకు తొలి ఓటమి. ఆ తర్వాత ఆర్నెళ్లకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి.. ఎంపీగా విజయం సాధించారు.

రేవంత్‌ సత్తాను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్.. కొందరు సీనియర్ల అభ్యంతరాలను కాదని మరీ ఆయన్ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2021 జులైలో పూర్తిస్థాయి పీసీసీ చీఫ్‌గా నియమించింది పార్టీ హైకమాండ్. ఆ తర్వాత కాంగ్రెస్‌ దిశను మార్చారు రేవంత్.. పార్టీ అధ్యక్షుడిగా నేతలకు దూకుడు నేర్పించారు. బీఆర్ఎస్‌, బీజేపీ నేతలకు విమర్శలకు ఎప్పటికపుడు కౌంటర్లు వేశారు. పనైపోయిందనుకున్న కాంగ్రెస్‌ పార్టీని బలంగా రేసులోకి తీసుకొచ్చాడు. అన్నీ తానై నడిపించారు. సీనియర్లను, జూనియర్లను కలుపుకుని సాగారు. మూడో స్థానానికే పరిమితం అవుతుందన్న బీఆర్ఎస్‌, బీజేపీ విమర్శలకు చెక్ పెట్టడమే కాదు.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రెండుసార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ను…రేసులోకి తీసుకురావడానికి పాదయాత్ర చేశారు. సీనియర్లను కలుపుకొని ముందుకు సాగారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ…హస్తం పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు. తన సత్తా ఏంటో బీఆర్ఎస్‌ నేతలతో పాటు బీజేపీ నేతలకు చూపించారు. దూకుడుగా వ్యవహరించడమే తన గెలుపు మంత్రమంటూ…ఎన్నో సార్లు చెప్పారు. తన లక్ష్యం ప్రగతి భవన్‌ అంటూ ఎన్నో సార్లు చెప్పకనే చెప్పారు. ఇపుడా కలను సాకారం చేసుకున్నారు.