Anjanadri Temple: కర్ణాటక రాష్ట్రం హంపికి సమీపంలోని హనుమంతుడి జన్మస్థలంగా భావించే అంజనాద్రి కొండపై వెలసిన ఆలయంలో జరిగిన బంగారు ఆభరణాల విరాళం వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మే 8వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయ స్వామికి ‘ప్రభావళి’, ‘చక్రం’, ‘గద’ వంటి 12 రకాల ఆభరణాలను సమర్పించారు. అప్పట్లో ఈ విరాళం విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ఇవన్నీ స్వచ్ఛమైన బంగారు ఆభరణాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో మహేష్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఈ విరాళం వ్యవహారం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా జిల్లా అధికారులు నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో ఈ ఆభరణాల నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేయడంతో మహేష్ రెడ్డి తిరుమల జ్యువెలర్స్ నుంచి కొనుగోలు చేసినట్లుగా ఒక బిల్లును సమర్పించారు. ఏప్రిల్ 28న ‘ఏఎంఆర్’ కంపెనీ పేరుతో 1,400 గ్రాముల బంగారాన్ని రూ. 2.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆ బిల్లులో ఉంది. కానీ, ఆ రశీదుపై ఏప్రిల్ 24వ తేదీ ఉండటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. కొనుగోలు చేసిన తేదీకి, బిల్లుపై ఉన్న తేదీకి పొంతన లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అసలు ఏప్రిల్ 28న బంగారం కొనుగోలు చేస్తే, మే 8వ తేదీ లోపు (అంటే కేవలం ఎనిమిది రోజుల్లోనే) అంత పెద్ద ప్రభావళి, గద వంటి 12 రకాల అత్యంత క్లిష్టమైన డిజైన్లు కలిగిన ఆభరణాలను తయారు చేయడం ఎలా సాధ్యమనే సందేహాలు భక్తుల్లోనూ, అధికారుల్లోనూ వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, జిల్లా యంత్రాంగం నిర్వహించిన సాంకేతిక పరీక్షల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాత పేర్కొన్నట్లుగా ఆ ఆభరణాల్లో 1,400 గ్రాముల బంగారం లేదని, కేవలం 250 నుంచి 300 గ్రాముల బంగారం మాత్రమే ఉందని ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన భాగమంతా రాగితో చేసి, పైన బంగారు పూత పూసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంతోనే ఆ ఆభరణాలను ఆలయ ఖజానాలో చేర్చుకోవడానికి జిల్లా యంత్రాంగం నిరాకరించింది. ఇది నిజమైన భక్తితో చేసిన విరాళమా లేక కేవలం ప్రచారం కోసం చేసిన హంగామానా అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆభరణాల విలువ, వాటి తయారీలో వాడిన లోహాలు, సమర్పించిన బిల్లులపై అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఈ విరాళంపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
