Site icon NTV Telugu

Bruce Lee Biopic: ఆంగ్ లీ డైరెక్షన్‌లో ‘బ్రూస్ లీ బయోపిక్’!

Bruce Lee Biopic

Bruce Lee Biopic

Bruce Lee Biopic: ‘బ్రూస్ లీ’ ఒకప్పుడు ఈ పేరంటే యాక్షన్ మూవీస్ ఫ్యాన్స్ కు మహా ఇష్టం! ఇక బ్రూస్ లీ లాగా ఫైట్స్ చేయాలి అనుకున్నవారికి మరింత ఇష్టంగా ఉండేది. బ్రూస్ లీ నటించిన చిత్రాలను చూసి ఎంతోమంది మార్షల్ ఆర్ట్స్ పై మోజు పెంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. మన తెలుగులో కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’ చూసి సంగీతంపై మోజు పెంచుకున్నవారు ఎందరో ఉన్నట్టుగా అప్పట్లో బ్రూస్ లీ సినిమాలు చూసి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నవారెందరో! అలాంటి బ్రూస్ లీ జీవితగాథ ఆధారంగా సినిమా తీయాలని ఎప్పటి నుంచో చైనా సినీజనం ఆశిస్తున్నారు. బ్రూస్ లీకి యాక్షన్ మూవీస్ లో వారసుడిగా పేరొందిన జాకీ చాన్ తోనే ఆ ప్రయత్నం చేయాలని భావించారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, దర్శకుడు ఆంగ్ లీ ఆ ప్రయత్నానికి తెర తీస్తున్నారు. ఇందులో ఆంగ్ లీ తనయుడు యంగ్ హీరో మాసన్ లీ ‘బ్రూస్ లీ’గా నటించబోతుండడం విశేషం!

Senior Heroine Seetha: అల్లు అర్జున్ రీల్ తల్లి.. హీరోయిన్ ను మించి ఉందిగా

బ్రూస్ లీ 1973లో తన 32వ యేట మరణించారు. ఆయన మృతిపైనా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆయన నటించిన “ఎంటర్ ద డ్రాగన్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ద వే ఆఫ్ ద డ్రాగన్” చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ మూవీస్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరించాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రూపొందిస్తున్నట్టు స్క్రిప్ట్ రైటర్ డాన్ ఫట్టర్ మేన్ చెబుతున్నారు. “క్రౌచింగ్ టైగర్ – హిడెన్ డ్రాగన్, లైఫ్ ఆఫ్ పై, బ్రోక్ బ్యాక్ మౌంటేన్” చిత్రాలతో యావత్ ప్రపంచాన్నీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు ఆంగ్ లీ ఈ చిత్రాన్ని ప్రాక్ పశ్చిమ భేదాలు లేకుండా అలరించిన బ్రూస్ లీ స్టైల్ లోనే తెరకెక్కిస్తున్నామని చెప్పారు. నిజానికి బ్రూస్ లీ పై సినిమా తీయాలన్నది తన జీవిత ధ్యేయమనీ ఆంగ్ లీ అంటున్నారు. తన తనయుడు మాసన్ లీని బ్రూస్ లీగా ఏ తీరున తెరపై ఆంగ్ లీ ఆవిష్కరిస్తారో చూడాలని సినీ ఫ్యాన్స్ ముఖ్యంగా బ్రూస్ లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఆంగ్ లీ ‘బ్రూస్ లీ’ ఎప్పుడు ఎలా జనం ముందు నిలుస్తాడో చూద్దాం.

Exit mobile version