Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్

Suma

Suma

టాలీవుడ్ కు యాంకర్ సుమ అంటే ఒక బ్రాండ్. ఎన్నో ఏళ్లుగా వందలాది సినీ వేడుకలకు ఆమె కేరాఫ్ అడ్రస్. అయితే ఎప్పుడూ తన మాటలతో, పంచులతో అందరినీ నవ్వించే సుమ.. తాజాగా స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకునేంత ఎమోషనల్ అయ్యారు. ఏకంగా తన స్క్రిప్ట్ పేపర్ లోనే ఓ సర్ ప్రైజ్ ను దాచిపెట్టి తనను షాక్ కు గురిచేశారంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి అన్న మాటలకు తాను ఫిదా అయిపోయానంటూ సుమ కనకాల పెట్టిన ఎమోషనల్ నోట్ వైరల్ అవుతోంది. ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (DTTT) సినిమా వేదికపై సుమకు ఊహించని సర్ ప్రైజ్ ఎదురైంది. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’ విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, సరిగ్గా అదే సమయంలో సుమ కూడా ఫిల్మ్ ఈవెంట్స్ హోస్ట్ గా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా సుమ ప్రయాణాన్ని వివరిస్తూ స్టేజ్ పై ఒక ప్రత్యేకమైన ఏవీ (AV) ప్లే చేశారు. అయితే, యాంకర్ గా ఆ ఈవెంట్ నడుపుతున్న సుమకు ఈ విషయం ఏమాత్రం తెలియకుండా శ్రేయాస్ మీడియా టీమ్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, లక్ష్మి కలిసి ఆమె ప్రోగ్రామ్ షీట్ లో దీన్ని సీక్రెట్ గా ఉంచారు. ఆ ఏవీ ప్లే అవ్వగానే సుమ ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయి భావోద్వేగానికి గురయ్యారు.

ఈ వేడుకలో రాజమౌళి తన గురించి చెప్పిన మాటలు వింటుంటే.. ఇన్నాళ్లకు తన ‘గ్రాడ్యుయేషన్’ (పట్టభద్రోత్సవం) పూర్తయినట్లు అనిపించిందని సుమ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు స్టూడెంట్ నెం.1 పాతికేళ్ల శుభాకాంక్షలు చెబుతూనే.. తన భర్త రాజీవ్ కనకాలపై ప్రేమ కురిపించారు. “రాజా.. నా జీవితంలోకి ఇంత మంచి వ్యక్తులను తీసుకొచ్చింది నువ్వే” అంటూ భర్తకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. మలయాళీ అయినప్పటికీ తనను తెలుగింటి ఆడపడుచుగా ఆదరిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు సుమ కృతజ్ఞతలు తెలిపారు. మీరు లేకుండా హోస్ట్ గా తన ఉనికి లేదన్నారు. అలాగే తన తల్లి గురించి చెబుతూ.. “నన్ను ఆపలేని శక్తిగా మార్చి, నాకు తెలుగు నేర్పి, కెరీర్ లో నిలదొక్కుకోవాలంటే కఠోర శ్రమ, స్థిరత్వం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తత్వాన్ని నేర్పింది మా అమ్మే” అని ఎమోషనల్ అయ్యారు. తాను ప్రశాంతంగా పని చేసుకునేలా స్పేస్ ఇస్తూ, ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉండే తన పిల్లలు రోషన్, మానస్ లకు కూడా థాంక్స్ చెబుతూ సుమ పెట్టిన ఈ సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది.