Site icon NTV Telugu

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కైవసం చేసుకున్న అమెరికా అధ్యక్షులు వీళ్లే..

Nobel

Nobel

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి విజేతను ఈరోజు ప్రకటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అవార్డు అందుకోవాలని తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే.. వైట్ హౌస్ ప్రచారం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో ట్రంప్‌ను “ది పీస్ ప్రెసిడెంట్” అని ప్రకటించింది. ఇది నోబెల్ శాంతి అవార్డు కోసం ట్రంప్ చేసిన ప్రచారంలో ఇది భాగం. ట్రంప్ తన రెండు పదవీకాలాలలో ఈ అవార్డుకు అనేకసార్లు నామినేట్ అయ్యారు. ఈ సారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, కంబోడియాకు చెందిన హున్ మానెట్, అమెరికా చట్టసభ సభ్యులు, పాకిస్థాన్ ప్రభుత్వం నామినేట్ చేశాయి. అయితే.. ఇప్పటి వరకు నలుగురు అమెరికన్ అధ్యక్షులు, ఒక అమెరికన్ ఉపాధ్యక్షుడు ఈ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

READ MORE: Pakistan Airstrikes: కాబూల్‌పై వైమానిక దాడి.. టీటీపీ చీఫ్ నూర్ లక్ష్యంగా పాక్ దాడి..?

థియోడర్ రూజ్‌వెల్ట్ (1906)
నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మొదటి అమెరికన్ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్. పోర్ట్స్‌మౌత్ ఒప్పందం ద్వారా రష్యా-జపనీస్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహించినందుకు ఆయనకు ఈ బహుమతి లభించింది. రూజ్‌వెల్డ్ పతకం ఇప్పటికీ వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లోని రూజ్‌వెల్ట్ గదిలో ప్రదర్శిస్తున్నారు.

వుడ్రో విల్సన్ (1919)
యునైటెడ్ స్టేట్స్ 28వ అధ్యక్షుడు వుడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించడం, శాంతిని కాపాడటానికి ఉద్దేశించిన ప్రపంచంలోని మొట్టమొదటి అంతర్ ప్రభుత్వ సంస్థ అయిన లీగ్ ఆఫ్ నేషన్స్‌ను స్థాపించారు. ఇందుకు గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

జిమ్మీ కార్టర్ (2002)
అమెరికా 39వ అధ్యక్షుడైన కార్టర్ పదవీవిరమణ చేసిన 21 సంవత్సరాల తర్వాత ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ సంఘర్షణలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేశారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడానికి, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి దశాబ్దాలుగా అవిశ్రాంత ప్రయత్నాలు చేశారని నోబెల్ కమిటీ పేర్కొంది.

బరాక్ ఒబామా (2009)
44వ అమెరికా అధ్యక్షుడు ఒబామా. అంతర్జాతీయ దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆయన అసాధారణ ప్రయత్నాలు చేశారు. అణు నిరాయుధీకరణ, వాతావరణంపై శ్రద్ధ విహించడంతో ఈ గౌరవం లభించింది.

అల్ గోర్ (2007)
ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్న ఏకైక అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్. మానవ నిర్మిత వాతావరణ మార్పు గురించి మరింత జ్ఞానాన్ని సేకరించి వ్యాప్తి చేయడానికి చేసిన ప్రయత్నాలకు గాను అల్ గోర్ 2007 నోబెల్ శాంతి బహుమతిని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) తో పంచుకున్నారు.

 

 

 

Exit mobile version