Site icon NTV Telugu

Ambati Rambabu Case: అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఆసక్తికర వాదనలు..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, పోలీస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 18వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసు 2023 సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించినది. ఈ వ్యవహారంపై గుంటూరులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ కొనసాగుతోంది.

Read Also: Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!

ఈ సందర్భంగా కోర్టులో ఇరు పక్షాల మధ్య ఆసక్తికర వాదనలు సాగాయి.. అంబటి రాంబాబు తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. ఆయన వాదనల్లో.. తీవ్ర నేరాలు, జీవితఖైదు శిక్షలు పడే కేసుల్లోనే బెయిల్ నిరాకరించాలి.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ అవసరం లేదని.. రెండేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్లు మాత్రమే ఉన్నందున కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు.. అంబటికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు..

మరోవైపు, పోలీసుల తరఫు న్యాయవాది.. అంబటి రాంబాబు లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వాదించారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కోసం పోలీస్ కస్టడీ అవసరమని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బెయిల్ మరియు పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పును ఈ నెల 18వ తేదీకి రిజర్వ్ చేశారు. ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Exit mobile version