Site icon NTV Telugu

బాలయ్య టపాస్ లాంటోడు: అల్లు అరవింద్

తెలుగు ఓటీటీల్లో దూసుకుపోతున్న ఆహా సంస్థ 2.0 అంటూ కొత్త వెర్షన్ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాలకు అవార్డులను ప్రదానం చేశారు. బెస్ట్ యాక్టర్ అవార్డును కలర్ ఫోటో సినిమా హీరో సుహాస్ అందుకున్నాడు. ఉత్తమ నటి అవార్డు కూడా కలర్ ఫోటో సినిమాకే వచ్చింది. ఆ మూవీ హీరోయిన్ చాందిని చౌదరి ఈ అవార్డును సొంతం చేసుకుంది.

Read Also: హీరో నందమూరి బాలకృష్ణకి ఆపరేషన్

మరోవైపు ఆహా ఓనర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ… హీరో బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక టాక్ షో చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు హోస్టుగా ఎవరిని తీసుకోవాలో తర్జన భర్జన పడుతుండగా తాను బాలయ్య పేరు సూచించానని, కానీ ఆయన చేస్తారో లేదో అన్న అనుమానం తమకు కలిగిందన్నారు. తాను వెంటనే బాలయ్యకు ఫోన్ చేసి ‘ఆహా’ చూస్తుంటారా అని అడగ్గా.. చూస్తుంటానని ఆయన సమాధానం చెప్పారని అల్లు అరవింద్ తెలిపారు. సమంత షో తరహాలో ఒక షో మీతో చేయాలని భావిస్తున్నామని తాను అడగ్గానే.. ఆయన తమ టీమ్‌ను పంపమని చెప్పారని… వాళ్లు వెళ్లి బాలయ్యకు కాన్సెప్ట్ చెప్పగా బాగుందని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. బాలయ్య అన్ని విషయాలను స్ట్రెయిట్‌గా చెప్తారని.. ఆయనకు నచ్చితే నచ్చిందని.. లేకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పేస్తారని అల్లు అరవింద్ చెప్పారు. బాలయ్య టపాస్ లాంటోడని ఆయన కొనియాడారు. అన్‌స్టాపబుల్ షో అందరికీ నచ్చుతుందనే ధీమాను అల్లు అరవింద్ వ్యక్తం చేశారు.

Exit mobile version