Site icon NTV Telugu

Akash Deep: ఇలాంటి సోదరుడు ఉండటం నా అదృష్టం.. ఆకాశ్‌ దీప్ అక్క ఎమోషనల్!

Akash Deep

Akash Deep

భారత పేసర్ ఆకాశ్‌ దీప్‌ సోదరి జ్యోతి సింగ్‌ ఎమోషనల్ అయ్యారు. నాన్న, అన్నయ్య లేనప్పటి నుంచి ఆకాశ్‌ అన్నీ తానై కుటుంబాన్ని నడిపిస్తున్నాడని చెప్పారు. ఇలాంటి మంచి సోదరుడు ఉండటం చాలా అరుదు అని, ఇది తన అదృష్టం అని పేర్కొన్నారు. తన కోసం భావోద్వేగానికి గురై మ్యాచ్ ప్రదర్శనను అంకితం చేశాడని జ్యోతి సింగ్‌తెలిపారు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆకాశ్‌ దీప్‌ పది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనను తన సోదరి జ్యోతి సింగ్‌కు అంకితం చేస్తున్నట్లు ఆకాశ్‌ వెల్లడించాడు.

ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి సింగ్‌ పలు విషయాలు పంచుకున్నారు. ‘ఆకాశ్‌ దీప్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. న సోదరుడు 10 వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే ముందు అందరం ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. నేను చాలా బాగున్నా, నా గురించి ఎలాంటి ఆందోళన పడొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం కోసం బాగా ఆడు అని చెప్పా. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. క్యాన్సర్‌ ఇప్పుడు మూడో స్టేజ్‌లో ఉంది. ఆరు నెలల ట్రీట్‌మెంట్ అవసరమని వైద్యులు చెప్పారు. చూడాలి ఏం జరుగుతుందో. తమ్ముడు వికెట్‌ తీసినప్పుడల్లా చాలా సంతోషపడ్డాను. మా చుట్టుపక్కల వాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. అది చూసి నాకు ఆనందం వేసింది’ అని జ్యోతి సింగ్‌ తెలిపారు.

‘ఆకాశ్‌ దీప్‌ మీడియాలో నా గురించి చెప్పాడని నాకు ముందు తెలియదు. ఎందుకంటే క్యాన్సర్ గురించి బయట మాట్లాడకూడదనుకున్నాం. ఆకాశ్‌ నాకోసం భావోద్వేగానికి గురై తన మ్యాచ్ ప్రదర్శనను అంకితం చేశాడు. ఇది నాపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆకాశ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడా. కంగారు పడొద్దు, దేశం మొత్తం మనకు అండగా ఉందని నాతో చెప్పాడు. అప్పుడు నేను కంట్రోల్‌ చేసుకోలేకపోయా. ఒక్కసారిగా ఏడ్చేశా. మా నాన్న, అన్నయ్య లేనప్పటి నుంచి ఆకాశ్‌ కుటుంబ భారం మోస్తున్నాడు. ఇలాంటి సోదరుడు ఉండటం నా అదృష్టం’ అని జ్యోతి సింగ్‌ ఎమోషనల్ అయ్యారు. తన సోదరి క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆమెకే ఈ మ్యాచ్ ప్రదర్శనను అంకితం చేస్తున్నట్లు మ్యాచ్ అనంతరం ఆకాశ్‌ తెలిపాడు.

Exit mobile version