పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట పంచాయతీ రాజకీయాలు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి ఎవరు నిలబడతారనే అంశంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆచంట సర్పంచ్ స్థానాన్ని కూటమిలో భాగంగా జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన నేత కొణిదెల సత్యనారాయణ చేసిన ఒక ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆచంట సర్పంచ్ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించి, అందరి అంగీకారంతో ఏకగ్రీవం చేస్తే తాను స్వయంగా రూ. 2 కోట్ల నిధులతో పంచాయతీని అభివృద్ధి చేస్తానని ఆయన ప్రతిపాదించారు. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొణిదెల సత్యనారాయణ ఈ రూ. 2 కోట్ల అభివృద్ధి నిధుల ప్రస్తావన తెచ్చారు. ఈ ప్రతిపాదనకు ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన లభించినట్లు సమాచారం వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆచంట గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు తామందరం సహకరిస్తామని అఖిలపక్ష నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆచంట నియోజకవర్గంలో ఇప్పటివరకు తమ పార్టీకి తగిన రాజకీయ ప్రాధాన్యత దక్కలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న 4 జడ్పీటీసీలు, 4 ఎంపీపీలు, అలాగే 2 ఏఎంసీ చైర్మన్ పదవులన్నీ కేవలం టీడీపీకే కేటాయించారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆచంట సర్పంచ్ స్థానమైనా తమ జనసేన పార్టీకి కేటాయించి తగిన న్యాయం చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అందరి సహకారంతో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకుని, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే పట్టుదలతో జనసేన వర్గాలు ముందుకు వెళ్తున్నాయి. మరి ఈ విషయంలో కూటమి నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆచంట రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

