NTV Telugu Site icon

Karnataka: వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ

Traffice Challans

Traffice Challans

వాహనదారులను అదుపు చేస్తూ… అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపిస్తారు. అయితే పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. మరికొందరు వాటిని పెండింగ్‌లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా పెండింగ్‌ లో ఉండే మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పటికే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్ల ఎన్నింటినో ప్రకటించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారికి చలాన్లపై 50 శాతం రాయితీని ప్రకటించింది.

ఆగస్టు 1 నుంచి ఆగస్టు 9 వరకు రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి కర్ణాటకలో ఈ-చలాన్‌లు వచ్చాయని రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ) అలోక్ కుమార్ తెలిపారు. డేటా ప్రకారం దేశంలోని 50 శాతం ట్రాఫిక్ ఈ-చలాన్లు కర్ణాటక నుంచే వచ్చాయని తెలిపారు. డేటా ప్రకారం, కర్ణాటకలో ఆగస్టు 1 నుంచి 9 వరకు మొత్తం 24,694 ఈ- చలాన్లు విధించారు. అయితే వాటిలో కేవలం 111 చలాన్లకు మాత్రమే జరిమానా చెల్లించారు. ఏఏ రాష్ట్రాల్లో ఎన్ని చలాన్లు జారిచేశారో ఆలోక్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా డేటాను పంచుకున్నారు. త్వరలో కర్ణాటక అంతా ఈ-చలాన్‌లనే తీసుకు వస్తామని, మ్యాన్యువల్‌ రసీదులకు త్వరలో కాలం చెల్లనుందని తెలిపారు. చలాన్లపై రాయితీ ప్రకటించడతంలో కట్టేందుకు జనం ఆసక్తిని కనబరిచారు. ట్రాఫిక్‌ పోలీసుల వద్ద గుమిగూడారు. అంతే కాకుండా పేటీఎంలు, అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా కూడా చాలా మందిని చలాన్లను చెల్లిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే ఆదాయం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ యేడాదిలో ఫ్రిబ్రవరిలో కూడా కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి రాయితీనే ప్రకటించి భారీ ఆదాయాన్నే పొందింది.