Innovative Protest: ఈ మధ్య కాలంలో పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోయారు. పెళ్లి చేసుకునే వయసులో జీవితంలో ఇంకా సెటిల్ కాకపోవడం.. సెటిల్ అయ్యే సమయానికి ఏజ్ దాటిపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. 30దాటిందంటే ముదురు బెండకాయలుగా లెక్కగట్టేస్తున్నారు అమ్మాయిలు. దీంతో 30దాటిన యువకులకు పెళ్లి అనేది పెద్ద సమస్యగా తయారైంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని సోలాపూర్ యువకులు చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగంలో స్థిరపడినా కూడా పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయిలు దొరక్కపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్కపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన నిర్వహించారు.
Read Also: India Population: మరో నాలుగు నెలల్లో భారత్ నం.1.. రెండో స్థానానికి చైనా
మహారాష్ట్రలోని సోలాపూర్ కలెక్టరేట్‌కు 50 పెండ్లి కుమారులు గుర్రాలపై మేళ తాళాలతో బుధవారం ఊరేగింపుగా వచ్చారు. అక్కడున్నవారు అంతా కలెక్టర్‌ను పెండ్లికి ఆహ్వానించడానికి ఇంత మంది ఒకేసారి వచ్చారని ఆశ్చర్యపోయారు. కానీ, వారు నేరుగా కలెక్టర్ చాంబర్‌కు వెళ్లి ‘మా పెండ్లి ఎప్పుడు సారూ..’ అంటూ వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో పురుష-మహిళల నిష్పత్తిని మెరుగుపర్చడానికి ప్రీ కాన్సెప్షన్, ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ చట్టాలన్ని కచ్చితంగా అమలుచేయాలని కోరారు. మహారాష్ట్రలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1000 మంది పురుషులకు 920 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
Read Also: Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
క్రాంతి జ్యోతి పరిషత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పురుషులకు సరిపడా మహిళల సంఖ్య లేదన్నారు. దేశంలోని ఒక్క కేరళలో మాత్రమే అబ్బాయిల కంటే అమ్మాయిల నిష్పత్తి ఎక్కువగా ఉందని అన్నారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవడమే కారణమని ఆరోపించారు.