Site icon NTV Telugu

Indian Young Athletes: క్రికెట్ నుంచి చెస్ వరకు.. 2025లో ప్రపంచ వేదికలపై భారతీయ యువ ప్లేయర్ల ఆధిపత్యం

Indian Young Sports Stars

Indian Young Sports Stars

Indian Young Sports Stars Shine Globally in 2025: ఈ ఏడాదిలో భారతీయ యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటారు. సీనియర్ ఆటగాళ్లు తమ ప్రదర్శన కొనసాగించినప్పటికీ.. యూత్ మాత్రం అద్భుతంగా రాణించారు. క్రికెట్ నుంచి చెస్ వరకు, భారత యువ తారలు ప్రపంచాన్ని జయించారు. భారత త్రివర్ణ పతాకం గతంలో ఎన్నడూ లేనంతగా ఎగరేశారు. ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలను సాధించిన యువత, క్రీడల గురించి తెలుసుకుందాం..

వైభవ్ సూర్య వంశీ..
ప్రపంచ క్రికెట్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోయింది. 2025 ఏడాది రికార్డుల పండుగలా మారింది. ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన అతి పిన్న వయస్కుడిగా నిలవడమే కాకుండా, గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో శతకం చేసి టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అండర్-19 వన్డేల్లో 52 బంతుల్లో 143 పరుగులు చేసి అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 బంతుల్లో 108 పరుగులు చేసి అక్కడ కూడా అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. పురుషుల లిస్ట్-ఏ క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ అద్భుత విజయాల కారణంగా వైభవ్ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం లభించింది.

దివ్య దేశ్‌ముఖ్..
చెస్ ప్రపంచంలో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. జార్జియాలో జరిగిన ఫిడే మహిళల వరల్డ్ కప్ 2025లో ఆమె విజేతగా నిలిచింది. ఆల్-ఇండియా ఫైనల్లో అనుభవజ్ఞురాలైన హంపీ కోనేరును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన నాలుగో భారత మహిళగా దివ్య దేశ్‌ముఖ్ చరిత్రలో నిలిచింది.

అనాహత్ సింగ్..
స్క్వాష్‌లో 17 ఏళ్ల అనాహత్ సింగ్ భారత క్రీడా చరిత్రను మార్చింది. ఏడాది పొడవునా జరిగిన ఇండియన్ ఓపెన్, ఇండియన్ టూర్ ఫైనల్స్‌లో సీనియర్ ప్లేయర్ జోష్నా చినప్పాను మూడుసార్లు ఓడించి తన ఆధిపత్యాన్ని చూపించింది. చెన్నైలో జరిగిన స్క్వాష్ వరల్డ్ కప్‌లో ఆమె నాయకత్వంలో భారత జట్టు తొలిసారి ప్రపంచ కప్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో హాంకాంగ్‌పై అనాహత్ సింగ్ నేరుగా గెలిచింది. జోష్నా చినప్పా, అభయ్ సింగ్ విజయాలు కూడా భారత్‌కు తొలి వరల్డ్ కప్ బంగారు పతకాన్ని అందించాయి.

షీతల్ దేవి..
పారా ఆర్చరీలో షీతల్ దేవి ప్రేరణాత్మక చరిత్ర రాసింది. గ్వాంగ్జూలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల షీతల్ దేవి మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం సాధించింది. చేతులు లేకపోయినా తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆమె, ఫైనల్లో టర్కీకి చెందిన ప్రపంచ నంబర్ వన్ ఓజ్నూర్ కురే గిర్దిని 146-143 తేడాతో ఓడించింది. వ్యక్తిగత స్వర్ణంతో పాటు, జట్టు విభాగంలో వెండి, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం కూడా గెలుచుకుంది.

సచిన్ యాదవ్..
టోక్యోలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల సచిన్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. నీరజ్ చోప్రాపై అందరి దృష్టి ఉన్నప్పటికీ.. సచిన్ యాదవ్ 86.27 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచాడు. పతకం తృటిలో తప్పినా, జావెలిన్ ప్రపంచంలో భారత జెండా అగ్రస్థాయిలో ఎగరేశాడు.

సమ్రాట్ రాణా..
షూటింగ్ రంగంలో సమ్రాట్ రాణా చరిత్ర సృష్టించాడు. కైరోలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2025లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు. ఒలింపిక్ పిస్టల్ ఈవెంట్‌లో వ్యక్తిగత ప్రపంచ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన సమ్రాట్, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో భారత షూటింగ్‌కు ఆశలు చిగురించేలా చేశాడు.

షఫాలీ వర్మ..
మహిళల క్రికెట్‌లో 2025 చారిత్రాత్మక సంవత్సరం. షఫాలీ వర్మ తన అద్భుత ప్రదర్శనతో తనదైన ముద్ర వేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆమె 78 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసకరంగా ఆడింది. ఈ ప్రదర్శనతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అర్ధశతకం చేసిన అతి చిన్న వయస్కురాలిగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షఫాలీ, భారత్ మహిళల జట్టుకు తొలి సీనియర్ వరల్డ్ కప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించింది.

అనిమేష్ కుజూర్..
అథ్లెటిక్స్ ట్రాక్‌పై అనిమేష్ కుజూర్ అనే కొత్త స్ప్రింట్ స్టార్ వెలుగులోకి వచ్చాడు. గ్రీస్‌లో జరిగిన డ్రమియా ఇంటర్నేషనల్ స్ప్రింట్ అండ్ రిలేస్ మీట్ 2025లో 100 మీటర్ల జాతీయ రికార్డును 10.18 సెకన్లతో బద్దలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా, 200 మీటర్లలో కూడా 20.32 సెకన్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. చెన్నైలో జరిగిన నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 20.63 సెకన్లతో ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో దశాబ్దాల తర్వాత భారత్‌ను గ్లోబల్ స్ప్రింటింగ్ మ్యాప్‌పై నిలబెట్టాడు.

 

 

Exit mobile version