Site icon NTV Telugu

Presidential Poll: తొలి రోజు 11 నామినేషన్లు.. ఏపీ నుంచి ఒకరు

President

President

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్‌(ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేష‌న్ విడుద‌లైన బుధ‌వార‌మే ఏకంగా 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24న ముగుస్తుంది. ఈ లోగా కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకోవాల్సి ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌కు బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేసే వారిలో 50 మంది ప్రతిపాదిస్తే త‌ప్పించి నామినేష‌న్లు వేయ‌డం కుద‌ర‌దు. అయినా కూడా బుధ‌వారం తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌లు కాగా… వాటిలో సరైన పత్రాలు జతచేయని కారణంగా ఓ నామినేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్కరించారు. తాను ఓటరుగా నమోదు చేసుకున్న పార్లమెంటరీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో తన పేరున్నట్లు ధ్రువీకరణపత్రం జతచేయకపోవడంతో ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రాథమికస్థాయిలోనే రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోదీ తిరస్కరించారు.

తొలి రోజు నామినేషన్లు వేసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం మండలం చింతగుంట గ్రామానికి చెందిన డాక్టర్‌ మందాటి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. బిహార్‌లోని సారణ్‌ నియోజకవర్గానికి చెందిన లాలూప్రసాద్‌ యాదవ్‌ అనే వ్యక్తి కూడా దాఖలుచేశారు. రాష్ట్రపతి ఎన్నికలో నిల్చోవాలంటే ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ను ఎలక్టోరల్‌ కాలేజీలో సభ్యులుగా ఉన్న 50 మంది ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంటుంది. కానీ వీరి నామినేషన్లకు అలాంటి వారి మద్దతేమీ లేదు. పరిశీలన సమయంలో వీటన్నింటినీ తిరస్కరించే అవకాశం ఉంటుంది.

ఎన్నిక ఎలా..: పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, దిల్లీ, పుదుచ్చేరి సహా రాష్ట్రాల శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు నామినేట్‌ అయిన వారిని ఎలక్టోరల్‌ కాలేజీలో సభ్యులుగా గుర్తించరు. వారికి ఈ ఎన్నికలో ఓటేసే అర్హత లేదు. శాసనమండలి సభ్యులకు కూడా ఓటింగ్‌ అర్హత ఉండదు. దిల్లీలోని పార్లమెంటు హౌస్‌లోనూ, రాష్ట్రాల్లో వాటి శాసనసభల్లోనూ ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. పోలైన ఓట్లను దేశ రాజధానిలో లెక్కిస్తారు.

Exit mobile version