CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ తల్లి మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. 91 ఏళ్ల వయసులో సావిత్రి దేవి మరణించడంతో యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి మరణవార్తతో పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూజ్య మాతృమూర్తి సావిత్రి దేవి మరణవార్త అత్యంత బాధాకరం. తల్లి ప్రేమ, ఆశీస్సులు, ఆప్యాయతలు జీవితంలో వెలకట్టలేని సంపద. ఆమె మరణం కుటుంబానికి తీరని లోటు. దివంగత ఆత్మకు భగవంతుడు తన పాదాల చెంత స్థానం కల్పించాలని, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కుటుంబ సభ్యులందరికీ ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని బాబా కేదార్‌నాథ్‌ను ప్రార్థిస్తున్నాను” అని ధామి పేర్కొన్నారు.

