Site icon NTV Telugu

IRCTC Pantry Samosa: రైలులో సమోసా కొన్నాడు.. కొరగ్గానే ఖంగుతిన్నాడు

Paper In Samosa

Paper In Samosa

Yellow Paper In Samosa Served By IRCTC Pantry: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు.. అది కూడా దూరపు ప్రయాణం చేస్తున్నప్పుడు.. సాధారణంగా ఆకలేస్తుంది. అప్పుడు స్టేషన్‌లలో దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం గానీ, కొందరు అంతదాకా వేచి చూడలేక రైలులోనే ఉండే ప్యాంట్రీ నుంచి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవడం గానీ జరుగుతుంది. తాజాగా ఓ ప్రయాణికుడు రెండో మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. తనకు ఆకలి వేస్తుండటంతో, తాను ప్రయాణిస్తున్న రైలులోని ప్యాంట్రీ నుంచి సమోసా కొన్నాడు. అయితే, దాన్ని కొరగ్గానే అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే, అందులో ఒక కాగితం కనిపించింది. అంతే, దాన్ని తినడం మానేసి, ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. అవి వైరల్ అవ్వడంతో.. ఐఆర్‌సీటీసీ క్షమాపణలు చెప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

అజి కుమార్ అనే వ్యక్తి ఈ నెల 9వ తేదీన ట్రైన్ నం. 20921లో ముంబై నుంచి లక్నోకు బయలుదేరాడు. నిజానికి.. ఆ ట్రైన్ ఎనిమిదో తారీఖున బయలుదేరింది. ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత మరుసటి రోజు ఆ వ్యక్తికి ఆకలేసి, ఐఆర్‌సీటీసీ ప్యాంట్రీ సిబ్బంది విక్రయించిన సమోసా కొన్నాడు. తొలుత కొంచెం కొంచెం కొరికి తిన్నాడు. ఇంతలో అతనికి పసుపు రంగులో ఉండే ఒక కాగితం కనిపించింది. అది చూసి షాకైన అజి కుమార్.. ఫోటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఐఆర్‌సీటీసీ ప్యాంట్రీ సిబ్బంది సర్వ్ చేసిన సమోసాలో పేపర్ ముక్క వచ్చిందని, ఇలాంటి హైజీనిక్ ఆహారాలను సర్వ్ చేస్తోందంటూ అతను ఎద్దేవా చేశాడు. ఇంతటి గొప్ప ఆహారాన్ని సర్వ్ చేస్తున్నందుకు తాను సెల్యూట్ చేస్తున్నానని చురకలు అంటింటాడు. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం రైల్వే వ్యవస్థపై ధ్వజమెత్తారు.

రోజురోజుకి రైల్వే వ్యవస్థ మరింత దారుణంగా తయారవుతోందని, టికెట్ కన్ఫర్మేషన్ సహా కొన్ని అంశాల్లో మరీ తీసికట్టుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి డబ్బులు వసూలు చేస్తున్నా.. సేవలు మాత్రం అద్వాన్నంగా ఉంటున్నాయని విమర్శలు గుప్పించారు. ఒక నెటిజన్ అయితే.. పీఎన్ఆర్ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్ షేర్ చేయొద్దని, లేకపోతే ఆ పేపర్ ముక్కకి కూడా రైల్వే సంస్థ అదనపు చార్జీలు వసూలు చేస్తుందని సెటైర్లు వేశాడు. ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఐఆర్‌సీటీసీ స్పందించింది. అజి కుమార్‌ను క్షమించమని వేడుకొని.. పీఎన్ఆర్, మొబైల్ నంబరును డీఎంలో షేర్ చేయాలని కోరింది.

Exit mobile version