NTV Telugu Site icon

Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య

Bajaj

Bajaj

కంపెనీల్లో పని ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆ మధ్య ఈవై కంపెనీ ఉద్యోగి అన్నా సెబాస్టియన్ పెరాయిల్ పని ఒత్తిడి కారణంగా ప్రాణాలు పోయాయి. అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కూడా ఒక ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా తనువు చాలించింది. ఇలా ఇద్దరు మహిళా ఉద్యోగుల ప్రాణాలు పోయాయి. తాజాగా యూపీలో ఇలాంటి ఘటనతో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బజాజ్ ఫైనాన్స్‌లో ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్న 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకొని తరుణ్ సక్సేనా అనే ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు సీనియర్‌ అధికారుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ అయిదు పేజీల సూసైడ్‌ లేఖ రాశాడు. బజాజ్‌ ఫైనాన్స్‌లో లోన్‌ల ఈఎంఐల రికవరీ బాధ్యలు నిర్వర్తిస్తుండగా.. అయితే ఇచ్చిన టార్గెట్‌లు చేరుకోలేకపోయినట్లు వాపోయాడు. గత రెండు నెలలుగా తన లక్ష్యాలను చేరుకోవాలని పనిలో ఉన్న తన సీనియర్లు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు. లేదంటే జీతంలో కోతలు విధిస్తామని బెదిరిస్తున్నారని నోట్‌లో పేర్కొన్నాడు. తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ లక్ష్యాలను చేరుకోలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని తెలిపాడు. పైగా సీనియర్లు పదే పదే అవమానిస్తున్నారని, ఉద్యోగం పోతుందని ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు. గత 45 రోజులుగా నిద్రకూడా పోవడం లేదని భవిష్యత్తుపై భయంగా ఉందని, అందుకే చనిపోతున్నానని తెలిపాడు.

‘నా పిల్లల స్కూల్ ఫీజులను సంవత్సరం చివరి వరకు చెల్లించాను. నన్ను క్షమించండి. మేఘా, యథార్థ్, పీహులను జాగ్రత్తగా చూసుకోండి. మమ్మీ, పాపా, నేనెప్పుడూ ఏమీ అడగలేదు. నా కుటుంబం హాయిగా ఉండేందుకు దయచేసి రెండో అంతస్తును నిర్మించండి. పిల్లలను బాగా చదివించండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి’ అని తెలిపాడు. తన కుటుంబానికి బీమా సొమ్ము అందేలా చూడాలని బంధువులను కోరారు. అంతేగాక సీనియర్ల పేర్లను కూడా పేర్కొని వారిపై పోలీసు ఫిర్యాదును నమోదు చేయమని అతని కుటుంబాన్ని కోరాడు.

మృతుడికి తల్లిదండ్రులు, భార్య మేఘా, పిల్లలు యథార్థ్‌, పిహు ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పోలీసు అధికారి వినోద్‌ కుమార్‌ గౌతమ్‌ తెలిపారు. సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారని సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడని, ఆయన కుటుంబం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.