Woman Calmly Talks On Phone As Train Passes Over Her: సాధారణంగా మనం రోడ్డు గానీ, రైల్వే ట్రాక్స్ గానీ దాటుతున్నప్పుడు.. వాహనాలు ఏమైనా వస్తున్నాయా? అంటూ అటు, ఇటు పదిసార్లు చూసుకుంటాం. ఎలాంటి ప్రమాదం లేదని ఓ నిర్ణయానికి వచ్చాకే, దాటడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మనకు అదే సమయంలో ఫోన్ కాల్ వస్తే.. దాన్ని కట్ చేయడమో, మరీ ముఖ్యమైన కాల్ అయితే ముందడుగు వేయకుండా లిఫ్ట్ చేయడమే చేస్తాం. కానీ, ఓ యువతి ఏం చేసిందో తెలుసా? ప్రాణాల మీదకు వచ్చినా సరే, ఫోన్ మాట్లాడటం ఆపలేదు. తన మీద నుంచి రైలు దూసుకెళ్తున్నా, ఏదో ఇంట్లో మంచంపై పడుకుంటున్నట్లు.. తాపీగా పట్టాలపై ఫోన్ మాట్లాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహతక్‌లో ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ, రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. అడుగు దూరంలోనే ప్లాట్‌ఫామ్ ఉంది. అయితే.. ఇంతలోనే ఒక గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అలాంటి సమయంలో నాలాంటోడైతే.. ఫోన్‌ని పక్కనపెట్టి, గబుక్కున ప్లాట్‌ఫామ్ ఎక్కేస్తాడు. కానీ, ఆ యువతి మాత్రం తన ప్రాణాలను లెక్క చేయకుండా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. అటు ప్లాట్‌ఫామ్‌పై ఎక్కడానికి తగిన సమయం కూడా లేకపోవడంతో, రైలు పట్టాలపైనే పడుకుంది. విచిత్రం ఏమిటంటే.. అలాంటి పరిస్థితిలో కూడా ఆ యువతి ఫోన్ మాట్లాడుతూనే ఉంది. రైలు వెళ్లిపోయిన తర్వాత కూడా.. తాపీగా పైకి లేస్తూ, ఫోన్ మాట్లాడుతూనే ఉంది. అసలు ఏమీ జరగనట్టుగా, అదేదో అప్పుడే నిద్రలో నుంచి లేచినట్టు.. తాపీగా లేచింది.
ఈ వీడియోని ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రాణాల కన్నా, ఫోన్‌లో గాసిప్ చేయడమే ముఖ్యమైపోయిందా? అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక నెటిజన్లైతే ఆమెను ఏకిపారేస్తున్నారు. గాలంట్రీ అవార్డు కింద, ఆమెను లాగిపెట్టి ఒకటి కొట్టండంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, రైల్వే అధికారులు ఈ వీడియోని షేర్ చేసి, పట్టాలు దాటుతున్న సమయంలో జాగ్రత్తగా ఉండండని సూచించారు. నిజానికి.. ఈ ఘటన ఏప్రిల్‌లో జరిగింది. అయితే.. ఈమధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
