Wife Beat Her Husband With Family Members For Two Thousand: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, విభేదాలు ఏర్పడటం సహజమే! అయితే.. చాలామంది ఆ గొడవల్ని పెద్దదిగా చేసుకోకుండా, అప్పటికప్పుడే సమస్యని పరిష్కరించుకొని, తమ సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తారు. కానీ, కొందరు మాత్రం అలా కాదు. ఏదో పెద్ద ద్రోహం చేసినట్టో, జీవితమే నాశనం చేసినట్టో భావించి.. చిన్న గొడవల్ని కూడా పెద్దదిగా చేసుకుంటారు. ప్రతీకారం తీర్చుకునేందుకు పెద్ద స్కెచ్చులే గీసుకుంటారు. తాజాగా ఓ భార్య కూడా అదే పని చేసింది. కేవలం రూ. 2 వేల కోసం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిన ఆమె.. అక్కడికి పిలిపించి పుట్టించివారితో తీవ్రంగా దాడి చేయించింది. ఈ ఘటన బిహార్‌లోని సీతామఢీ జిల్లా షాబాజ్‌పుర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బైరహా గ్రామానికి చెందిన నాగేశ్వర్ సింగ్‌కు పదేళ్ల క్రితం షాబాజ్‌పుర్‌కు చెందిన పార్వతీ కుమారి అనే మహిళతో వివాహం అయ్యింది. కొన్ని రోజుల క్రితం వీరి మధ్య రూ. 2 వేల విషయమై గొడవ జరిగింది. ఆ కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 15 రోజుల తర్వాత భర్తకు ఫోన్ చేసి, పుట్టింటికి రమ్మని చెప్పింది. తన భార్య తప్పు తెలుసుకొని, తిరిగి ఇంటికి రావాలని నిర్ణయించుకున్నట్టుందని నాగేశ్వర్ అనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక అతనికి షాక్ తగిలింది. ఆ రెండు వేల కోసం తన పుట్టింటివారితో కలిసి మళ్లీ గొడవకి దిగింది భార్య. ఆ గొడవ పెద్దవి కావడంతో.. పుట్టింటివారు నాగేశ్వర్‌ను చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, గొడవను ఆపి, నాగేశ్వర్‌ను ఆసుపత్రికి తరలించారు. తన కళ్లలో యాసిడ్ పోశారని, తన కళ్లు కనిపించడం లేదని నాగేశ్వర్ చెప్తున్నాడు. కానీ, వైద్యులు మాత్రం యాసిడ్ లాంటి ఆనవాళ్లు లేవని పేర్కొంటున్నారు. చూస్తుంటే, పుట్టింటివారు కొట్టిన దెబ్బలకు అతని కళ్లు పోయినట్టున్నాయి.