NTV Telugu Site icon

Jaggi Johal: ఎవరీ జగ్గీ జోహల్‌?. అతణ్ని విడుదల చేయాలని బ్రిటన్‌ ఎందుకు కోరుతోంది?

Jaggal

Jaggal

జగ్గీ జోహల్‌ అనే బ్రిటన్‌ పౌరుణ్ని ఇండియా ఎందుకు అరెస్ట్‌ చేసింది?. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఎందుకు విచారణ జరుపుతోందనే ప్రశ్నలు ఇప్పుడు మన దేశంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఎవరీ జగ్గీ జోహల్‌ అనేది చూద్దాం. జగ్గీ జోహల్‌.. బ్రిటన్‌కి చెందినవాడు. ఆ దేశంలోని స్కాట్‌ల్యాండ్‌ పరిధిలోకి వచ్చే దుంబర్టన్‌ ప్రాంతవాసి. జగ్గీ జోహల్‌ పూర్తి పేరు జగ్‌తార్‌ సింగ్‌ జోహల్‌. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం 34 ఏళ్ల ఈ యువకుడు ఆన్‌లైన్‌ యాక్టివిస్ట్‌. ఓ మ్యాగజైన్‌, వెబ్‌సైట్‌ కోసం పనిచేస్తుండేవాడు.

ఆ వెబ్‌సైట్‌, ఆ మ్యాగజైన్‌ ఇండియాలో సిక్కులు వేధింపులకు గురవుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఆ సిక్కుల వివరాలను జగ్గీ జోహల్‌ ఇంగ్లిష్‌లోకి అనువదిస్తుంటాడు. ఇతను తొలిసారి 2017 అక్టోబర్‌ 2న ఇండియాకి వచ్చాడు. అదే నెల 18న పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఇక్కడికి చేరుకున్నాడు. ఇతని సోదరుడు, కుటుంబ సభ్యులు పెళ్లి తర్వాత స్వదేశం వెళ్లిపోగా ఇతను మాత్రం మన దేశంలోనే ఉండిపోయాడు. అయితే జగ్గీ జోహల్‌ని పంజాబ్‌ పోలీసులు తర్వాతి నెలలో (నవంబర్‌ 4న) అరెస్ట్‌ చేశారు.

తొలుత ఆయుధాల స్వాధీనానికి సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు 2016 డిసెంబర్‌లో బుక్‌ అయింది. తర్వాతర్వాత ఇతనిపై ఏడు కేసులు నమోదు చేశారు. అందులో ఐదు కేసులు హత్యలకు సంబంధించినవి కాగా రెండు కేసులు హత్యాయత్నానికి సంబంధించినవి. హిందూ సంస్థల కార్యకర్తలను, డేరా బాబా అనుచరులను, చివరికి ఓ పాస్టర్‌ని కూడా చంపారనేవి ఈ కేసుల్లో ప్రధాన ఆరోపణలు. ఎన్‌ఐఏ చెబుతున్న వివరాల ప్రకారం ఖలిస్థానీ లిబరేషన్‌ ఫోర్స్‌ (కేఎల్ఎఫ్‌) మిలిటెంట్లు హర్మిందర్‌ సింగ్‌ మింటో, హర్దీప్‌ సింగ్‌ 2013లో ఫ్రాన్స్‌, జర్మనీ పర్యటనలకు వెళ్లారు.

వాళ్లు పారిస్‌లో ఉన్నప్పుడు మింటూతోపాటు గుర్జిందర్‌ సింగ్‌ శాస్త్రి అనే మరో వ్యక్తి పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి బ్రిటన్‌ నుంచి వచ్చిన జగ్గీ జోహల్‌ని రిసీవ్‌ చేసుకున్నారు. మింటోకి 3 వేల యూరోల డబ్బుని ఇవ్వటానికి జగ్గీ జోహల్‌ పారిస్‌కి వచ్చాడు. ఆ డబ్బుని బ్రిటన్‌లోని గుర్షరణ్‌బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి ఇచ్చి పంపించాడు. అందులో కొంత మొత్తాన్ని మింటో.. హర్దీప్‌ సింగ్‌కి ఇచ్చాడు. కేఎల్‌ఎఫ్‌లో చేరటం కోసమే ఆ డబ్బుతో ప్రలోభపెట్టారు. పైన పేర్కొన్న హత్యల కోసమే అతణ్ని నియమించుకున్నారు. దీంతో మిలిటెంట్లకు ఫండ్స్‌ సరఫరా చేశాడనే ఆరోపణలను జగ్గీ జోహల్‌ ఎదుర్కొన్నాడు.

అంతేకాదు. తీహార్‌ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ సుఖ్మీత్‌పాల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖ్‌ భిఖారివాల్‌ని కలిశాడనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు 2021 జనవరిలో జగ్గీ జోహల్‌ని రిమాండ్‌కి తీసుకొని తర్వాత ఇతణ్ని వదిలేశారు. ఇదీ జగ్గీ జోహల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌. ఇదిలాఉండగా గత నాలుగున్నరేళ్లుగా ఇండియా నిర్బంధంలో ఉన్న జగ్గీ జోహల్‌ని విడుదల చేయాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు బ్రిటన్‌లో తీవ్రంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుత పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ కూడా 2017లో జగ్గీ జోహల్‌ అరెస్టు సమయంలో అతనికి అనుకూలంగా మాట్లాడినవాడే. ఇప్పుడు ఈ వ్యవహారం బ్రిటన్‌, ఇండియా ప్రధానమంత్రుల స్థాయిలో నడుస్తోంది. ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Punjab: రేపే పంజాబ్ ప్రభుత్వ తొలి మంత్రివర్గ విస్తరణ.. 5గురికి అవకాశం!