PM Modi: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ నాయకులు విమర్శల తీవ్రత పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన ‘‘ సంపద పునర్విభజన’’, శామ్ పిట్రోడా చేసిన ‘‘వారతస్వ పన్ను’’ వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల ఎన్నికల ర్యాలీల్లో ఈ ప్రస్తావననే ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా మరోసారి వారసత్వ పన్నుపై ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ మొరెనాలోని ఎన్నికల ర్యాలీలో ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1984లో మరణించిన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ, మరణానంతరం ఆమె సందప ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడేందుకు వారసత్వ పన్నును రద్దు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ ఆ పన్నుని తీసుకురావాలని భావిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ మతప్రాతిపదికన విభజనకు అంగీకరించి దేశాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి తమ డబ్బు వెళ్లకుండా రాజీవ్ గాంధీ వారసత్వ పన్నుని రద్దు చేశారని అన్నారు.
Read Also: Salaar 2 : ప్రభాస్ కు జోడిగా రామ్ చరణ్ హీరోయిన్..డైరెక్టర్ ప్లాన్ అదిరింది..
కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. అమెరికాలో వారసత్వ పన్ను ఉందని, ఇండియాలో కూడా తీసుకురావాలని కోరాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. ప్రజల సంపదను లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇటీవల సంపద సర్వే చేస్తాని, సంపద పునర్విభజన చేస్తామని చెప్పడం కూడా వివాదాస్పదంగా మారింది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజస్థాన్ బన్స్వారాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన సంపదను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచాలని చూస్తోంది’’అని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దేశ వనరులపై ముస్లింలకు తొలిహక్కు ఉందనే వ్యాఖ్యలను ప్రధాని ప్రస్తావించారు. కాంగ్రెస్ మన తల్లులు, సోదరీమణులు మంగళసూత్రాలను, బంగారాన్ని లాక్కోవాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ కోటాలో ముస్లిం కోటా వర్తింపచేస్తున్నట్లు ప్రకటించడం మరో వివాదాన్ని రాజేసింది. మతప్రాతిపదిక రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం దీనికి వ్యతిరేకమని, ఇలా కాంగ్రెస్ దొడ్డిదారిన ముస్లిం కోటా తీసుకురావడం బాబాసాహెబ్‌కి వెన్నుపోటు పొడవడమే అని ప్రధాని ఆరోపించారు.
