Site icon NTV Telugu

Boeing: “బోయింగ్” లోపాలను బహిర్గతం చేసిన జాన్ బార్నెట్ అనుమానాస్పద మృతి..

John Barnett

John Barnett

Boeing: విమాన తయారీ దిగ్గజం ‘బోయింగ్’కి సంబంధించిన రహస్యాలను బయటపెట్టిన ఆ సంస్థ మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానాస్పదంగా మరణించారు. ఎయిర్ లైనర్ సంస్థ లోపాలను బయటపెట్టిన వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి చెందారు. శనివారం ఆయన తన ఇంట్లో శవమై కనిపించారు. ఈ విషయాన్ని సౌత్ కరోలినా చార్టెస్టర్ కౌంటీ అధికారులు ధృవీకరించారు.

62 ఏళ్ల బార్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశారు. ఆయన బోయింగ్ సంస్థలో మూడు దశాబ్ధాలకి పైగా పనిచేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత బోయింగ్‌పై దీర్ఘకాల చట్టపరమైన చర్యల్ని ప్రారంభించారు. ఆయన మరణానికి ముందు బార్నెట్ కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్‌టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశాడు. 787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధుని విమానం.

Read Also: Cruel woman: మామను వాకింగ్ స్టిక్‌తో దారుణంగా కొట్టిన కోడలు.. వీడియో వైరల్..

బోయింగ్ గురించి ఏం చెప్పాడు:

2019లో బీబీసీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాడు. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయడని చెప్పారు. బోయింగ్ అత్యాధునిక 787 డ్రీమ్ లైనర్ క్యాబిన్ డికంప్రెషన్ సమయంలో ప్రయాణికులు మాస్కులు లేకుండా ఉండొచ్చనే విషయాన్ని వెల్లడించారు.

కొన్ని పరీక్షల్ని ప్రస్తావిస్తూ.. ఆక్సిజన్ వ్యవస్థల్లో నాలుగింట ఒక వంతు తప్పుగా ఉంచొచ్చని, అవసరమైన సమయాల్లో పనిచేయకపోవచ్చని బార్నెట్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్‌లపై పరీక్ష తర్వాత, 787 డ్రీమ్‌లైనర్ 25 శాతం వైఫల్యాన్ని చూపించిందని బార్నెట్ కనుగొన్నాడు. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగిందని, ఇది భద్రతపై రాజీ పడిందని ఆయన అన్నారు.

ఇదే కాకుండా కార్మికులు కర్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ప్రొడక్షన్ లైన్‌లో జాప్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా స్ర్కాప్ బిన్‌ల నుంచి తక్కువ ప్రామాణిక భాగాలను ఉపయోగించిందని, వాటిని విమానాలకు అమర్చారని అతను ఆరోపించాడు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యలేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ కొన్ని ఆందోళనల్ని సమర్థించింది.

అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది.

Exit mobile version